రాజధాని అమరావతిపై మరోసారి రచ్చ మొదలైంది.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రాజధాని నిర్మాణం విషయంలో చేసిన వ్యాఖ్యలు.. వాటికి కూటమి మంత్రులు, నేతలు కౌంటర్ ఇవ్వడంతో.. హాట్ టాపిక్‌గా మారిపోయింది.. మరోవైపు, వైఎస్ జగన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. నదీ గర్భం (River Bed)కు, నదీ పరివాహక ప్రాంతం (River Front)కు మధ్య ఉన్న తేడా కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. అమరావతి రాజధానిపై జగన్ మళ్లీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ రాజధానిపై విషం చిమ్మడం మానట్లేదని ఆయన మండిపడ్డారు.
Read Also: Anil Ravipudi : ప్రకృతి వార్నింగ్’తో పుట్టిన హుక్ స్టెప్..అందుకే నా నిర్మాతలు ఎప్పుడూ హ్యాపీ!
చిట్‌చాట్‌లో హాట్ కామెంట్లు చేశారు సీఎం చంద్రబాబు.. వైఎస్ జగన్ రాయలసీమకు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. ప్రపంచంలోని అనేక దేశాలు, ప్రధాన నగరాలు నదీ తీరాల పక్కనే అభివృద్ధి చెందాయని తెలిపారు. సింధు నాగరికత కూడా నదీ తీరంలోనే వికసించిందని గుర్తు చేశారు. ఢిల్లీ, లండన్ సహా ప్రపంచంలోని ప్రముఖ నగరాలన్నీ నదీ తీరాల్లోనే ఉన్నాయని ఉదాహరణగా పేర్కొన్నారు. అమరావతి విషయంలో వైసీపీ ఎప్పటికప్పుడు విష ప్రచారం చేస్తోందని, కనీస అవగాహన లేకుండా జగన్ మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. మిగులు జలాలను వినియోగించుకోవడం ఎలా తప్పవుతుందో జగన్ చెప్పాలని ప్రశ్నించారు. జగన్ వ్యాఖ్యలపై మంత్రులు ఇప్పటికే ఘాటుగా స్పందించారని తెలిపారు.
రాష్ట్రంలో వచ్చే రెండేళ్లలో నీటి కొరత లేకుండా సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. నీటి సద్వినియోగం వల్లే రాయలసీమలో ఉద్యాన వన పంటలు అభివృద్ధి చెందాయని, దేశ ఉద్యాన వన రంగంలో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలిచిందని చెప్పారు. నీటి విషయంలో వివాదాలు ఏర్పడితే నష్టపోయేది తెలుగు ప్రజలేనని, రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండేలా చూడడం తప్పేమీ కాదని అన్నారు. మిగులు జలాల సద్వినియోగంతోనే రాష్ట్రాలు సుభిక్షంగా మారుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమకు నీరిచ్చామనే విషయానికి పట్టిసీమ ప్రాజెక్టే నిదర్శనమని చెప్పారు సీఎం చంద్రబాబు… పట్టిసీమ ద్వారా రాయలసీమపై తమ చిత్తశుద్ధిని చాటుకున్నామని, ఆ ప్రాజెక్ట్ వల్ల ఉద్యాన వన పంటలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. అయితే, 2020లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను నిలిపివేసి స్వార్థ రాజకీయాలు చేశారని జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపించారు. కేవలం పట్టిసీమలో మట్టి పనులు చేసి రూ.900 కోట్ల బిల్లులు చేసుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ప్రధానం అని, నీటి విషయంలో ఎలాంటి రాజీ ఉండదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
