NTV Telugu Site icon

YS Jagan: చీకటి తర్వాత వెలుగు కూడా వస్తుంది.. ఎవరికి ఏ కష్టం వచ్చినా నావైపు చూడండి..

Ys Jagan

Ys Jagan

YS Jagan: వరుసగా వివిధ జిల్లాల నేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. భవిష్యత్‌ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తున్నారు.. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తున్నారు.. ఇక, ఈ రోజు అనంతపురం జిల్లా నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ జగన్.. ఆరు నెలలు తిరక్కముందే చంద్రబాబు ప్రభుత్వంమీద తీవ్ర వ్యతిరేకత ఉంది.. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వంమీదా లేదన్న ఆయన.. చంద్రబాబుని నమ్మడమంటే.. చంద్రముఖిని లేపడమే, పులినోట్లో తలపెట్టడమే అని ఆరోజు చెప్పాను.. దాన్ని ఇవాళ చంద్రబాబు నిజం చేస్తున్నారంటూ మండిపడ్డారు.. జగన్‌ పలావ్‌ పెట్టాడు.. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు.. కానీ, ఇప్పుడు పలావ్‌ పోయింది.. బిర్యానీ కూడా పోయిందని వ్యాఖ్యానించారు.. ఆరునెలల్లోనే వేల కోట్లకుపైగా భారాన్ని ప్రజలపై కరెంటు ఛార్జీల రూపంలో వేశారని విమర్శించారు జగన్‌..

Read Also: Prasad Behara: ప్రసాద్ బెహరాకి నటితో పెళ్లి, విడాకులు.. బ్రేకప్ స్టోరీ తెలుసా?

ఇక, ఏపీలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది.. స్కామ్‌ల మీద స్కాంలు నడుస్తున్నాయని విమర్శించారు జగన్.. శాండ్ మాఫియా, లిక్కర్‌ మాఫియా.. ఇలా మాఫియాలు నడుస్తున్నాయి.. మైనింగ్‌ జరగాలన్నా, ఏ కాంట్రాక్టు చేయాలన్నా ప్రతి ఎమ్మెల్యే నుంచి మొదలుకుని ముఖ్యమంత్రి వరకూ నాకింత.. నీకింత నడుస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.. ప్రభుత్వం మీద వ్యతిరేకత పార్టీకి సానుకూలంగా మారాలంటే ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేయాలి..ఈ నెల 27న కరెంటు ఛార్జీల మీద నిరసన వ్యక్తంచేస్తూ మరో కార్యక్రమం చేస్తున్నాం.. మళ్లీ జనవరి 3న ఫీజురియింబర్స్‌మెంట్‌, వసతి దీవెనమీద చేస్తున్నాం.. ప్రజల తరఫున మనం గొంతు విప్పాలి.. అప్పుడే మనం నాయకులుగా ఎదుగుతాం.. నాయకులుగా ఎదగడానికి ఇదొక అవకాశం.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు, నష్టాలు ఉంటాయి.. కేసులుకూడా పెడతారు, జైళ్లలో కూడా పెడతారు.. ప్రతి కష్టానికి ఫలితం ఉంటుంది, చీకటి తర్వాత వెలుగు కూడా వస్తుంది.. ఏ కష్టం ఎవరికి ఎప్పుడు వచ్చినా.. నావైపు చూడండి.. 16 నెలలు నన్ను జైళ్లో పెట్టారు.. నా భార్య కనీసంగా 20 సార్లు బెయిల్‌ పిటిషన్‌ పెట్టి ఉంటుంది.. కింద కాంగ్రెస్‌, పైన కాంగ్రెస్‌.. ఇన్ని కష్టాలు పెట్టినా.. నేను ముఖ్యమంత్రిని కాలేదా? ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు.. ఎల్లకాలం కష్టాలు ఉండవు.. ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఢీకొనేలా ఉందాం.. మీ అందరికీ జగనన్న, పార్టీ తోడుగా ఉంటుందని ధైర్యాన్ని చెప్పారు వైఎస్‌ జగన్‌.

Read Also: Salman Khan : సల్మాన్‌కు వింత సెంటిమెంట్.. కలిసొచ్చేనా .?

సాగునీటి సంఘాల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఫైర్‌ అయ్యారు జగన్.. సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా చేశారు.. వీఆర్వోలను మండల కేంద్రాలకు రప్పించి, పోలీసులను కాపలాగా పెట్టించి ఎన్నికలు జరిపారు.. అలాంటప్పుడు ఎన్నికలు జరపడం ఎందుకు? అని నిలదీశారు. రాజీనామాలు చేసి బయటకు వస్తే, రైతులు సంతోషంగా ఉన్నారా? లేదా? తెలుస్తుందన్నారు.. ఇక, విజన్‌ 2047 పేరిట మరో డ్రామాకు తెరలేపారని దుయ్యబట్టారు.. ఎన్నికలకు ముందు చంద్రబాబు మేనిఫెస్టోపై ఊదరగొట్టారు.. ఈ మేనిఫెస్టోకు దిక్కులేదు, ఇప్పుడు 2047కు అర్థం ఏముంటుంది? అని ఎద్దేవా చేశారు.. ఇప్పుడు చంద్రబాబు వయస్సు దాదాపు 80 ఏళ్లు.. ఒక మనిషిని అభివృద్ధి బాటలో పట్టించడమే విజన్‌ అని నేను నమ్ముతాను.. మన ప్రభుత్వం రాకముందు ఒక రూపాయి ప్రజలకు ఇస్తే.. అది నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి ఉండేదా? కానీ, వైసీపీ హయంలో ఎక్కడా దళారీలేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేర్చగలిగాం అన్నారు.. గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటివద్దకే సేవలు అదించి గొప్ప విజన్‌ను తీసకురాగలిగాం.. కానీ, రంగరంగుల కథలు చెప్తున్నారు. దానికి విజన్‌ అని పేరుపెడుతున్నారు.. దాన్ని విజన్‌ చేయడం అనరు.. 420 అంటారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌..