YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్

Ys.jagan

Ys.jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్పీపై వివాదం కొనసాగుతూనే ఉంది.. రోజుకో ఆరోపణ.. పూటకో విమర్శ అన్నట్టు ముందుకు సాగుతూనే ఉంది.. ఈ వ్యవహారంపై సోషల్‌ మీడియ వేదికగా మరోసారి హాట్‌ కామెంట్లు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి.. డీఎస్సీ-2025 నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ సీబీఐ విచారణ కోరుతున్న వైఎస్ జగన్.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి ప్రశ్నలు సంధించారు. డీఎస్సీపై సీబీఐ విచారణ కోరితే ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. నియామకాలు పారదర్శకంగా జరిగాయంటూ చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తమకు తామే ధ్రువీకరణ ఇచ్చుకుంటే దానికి విలువ ఏముంటుందని జగన్ వ్యాఖ్యానించారు.

విజయవాడలో సోమవారం జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ.. శాంతియుతంగా సీబీఐ విచారణ కోరుతూ ర్యాలీ నిర్వహించేందుకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారని జగన్ ఆరోపించారు. లాఠీచార్జ్ చేయించారని, టీచర్ల ముసుగులో వచ్చిన కొందరితో దాడులు చేయించారని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ర్యాలీలు నిర్వహించే హక్కు కూడా లేదా అని చంద్రబాబును ప్రశ్నించారు. కాగా, పోలీసుల వాదన ప్రకారం విజయవాడలో అమలులో ఉన్న ఆంక్షలు, ట్రాఫిక్ పరిస్థితుల నేపథ్యంలో నిరసనకు అనుమతి ఇవ్వలేదని అధికారులు తెలిపారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. ఎలాంటి తప్పూ జరగలేదన్న నమ్మకం ప్రభుత్వానికి ఉంటే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన టీచర్ ఉద్యోగాల నియామకాల్లో పారదర్శకత, ప్రతిభకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్‌సీపీ గత కొంతకాలంగా సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం మాత్రం నియామక ప్రక్రియ నిబంధనల ప్రకారమే జరిగిందని చెబుతోంది. ఈ అంశంపై ఇరుపక్షాల మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. డీఎస్సీ వ్యవహారంలో పోలీసులను అడ్డుపెట్టుకుని సమస్యను పక్కదారి పట్టించలేరని జగన్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష గొంతును అణచివేయడం ద్వారా వాస్తవాలు బయటకు రాకుండా చేయలేరన్నారు. సీబీఐ ఆధ్వర్యంలో నిష్పాక్షిక విచారణ జరిగితేనే అభ్యర్థుల్లో కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకురాగలమని పేర్కొన్నారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరగాలని, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు పారదర్శకంగా ఉండాలని జగన్ అన్నారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ బాధితుల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్..