Site icon NTV Telugu

Konidela Nagababu: కొణిదెల నాగబాబు మంత్రి అయ్యేదెప్పుడు..?

Mlc Nagababu

Mlc Nagababu

Konidela Nagababu: జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఇప్పట్లో మంత్రి కాలేరని తెలుస్తోంది. ముందుగా ఆయన్ని రాజ్యసభకు పంపుదామని అనుకున్నారు. పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకున్నారు. సీఎం చంద్రబాబు కూడా ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ చేశారు. కానీ, ఏం జరిగిందో ఏమో కానీ.. ఇప్పటిదాకా నాగబాబు మంత్రి కాలేకపోయారు. ఇకపై అవుతారో..? కారో..? అనేది కూడా అనుమానమే.

Read Also: Off The Record: ఆ ఎమ్మెల్యే కోటరీ అప్పుడే దందాల్లో ఆరితేరిపోయారా?

ఎమ్మెల్సీగా ఎన్నిక కాగానే నాగబాబును కేబినెట్‌లోకి తీసుకోవాల్సిన పరిస్థితి. అప్పటికే కేబినెట్‌లో ఒక ఖాళీ కూడా ఉంది. దానిని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ప్రకటన చేశారనే అభిప్రాయాలున్నాయి. కానీ… నాగబాబును కేబినెట్‌లోకి తీసుకునే విషయంలో కొన్ని కారణాలు అడ్డు వచ్చాయి. ఈ అంశం తన దగ్గరే పెండింగ్‌లో ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను నిర్ణయం తీసుకోలేకపోవడం వల్లే పెండింగ్‌లో ఉందన్నారు. జనసేన ఒక సామాజిక వర్గానికి చెందిన పార్టీ అనే చర్చ బాగా ఉంది. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, మంత్రి కందుల దుర్గేష్‌ ఒకే సామాజికవర్గానికి చెందినవారు. నాగబాబును కూడా కేబినెట్‌లోకి తీసుకుంటే… అదే సామాజికవర్గం అన్న ముద్ర పడుతుంది. ఇది జనంలోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే ప్రమాదం ఉంటుందేమోనని తటపటాయించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ కారణంతోనే నాగబాబును కేబినెట్‌లోకి తీసుకోవడం డౌట్‌గా మారింది.

Read Also: CM Revanth Reddy : సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం.. హైదరాబాద్‌లో వరదనీటి సమస్యకు చెక్‌..!

నాగబాబును కేబినెట్‌లోకి తీసుకోవాలా..? వద్దా..? అనే విషయంలో డైలమాలో ఉన్నారు పవన్‌ కళ్యాణ్. మరికొన్ని కారణాలు కూడా కనిపిస్తున్నాయి. నాగబాబు సేవలను పూర్తిగా పార్టీకి వాడుకోవాలనే ఆలోచనలో పవన్ ఉన్నట్టు సమాచారం. నాగబాబును పార్టీలో యాక్టివ్‌గా ఉంచడంతోపాటు, ఆయనతో జిల్లా పర్యటనలు చేయించాలనే ఆలోచనలో పవన్ ఉన్నారు. మంత్రి పదవి ఇస్తే రెండిటికి న్యాయం చేయలేని పరిస్థితి ఉంటుందనే ఉద్దేశం కనిపిస్తోంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో బిజీగా ఉన్నారు. అటు సినిమా షూటింగ్‌ల హడావుడి కూడా నడుస్తోంది. కాబట్టి పార్టీకి సమయం కేటాయించే పరిస్థితి ఉండదు. దీంతో నాగబాబును పార్టీ కోసం ఎక్కువగా ఉపయోగించుకునే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో ఆలోచిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఒపీనియన్ మార్చుకుంటే కనుక నాగబాబు కేబినెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version