Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు యూ.ఎస్. కాన్సల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్.. మంగళగిరిలోని పవన్ కల్యాణ్ నివాసంలో ఈ రోజు ఉదయం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్‌కు అభినందనలు తెలియచేసి.. జ్ఞాపిక అందచేశారు యూఎస్ కాన్సల్ జనరల్.. ఇక ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ టీమ్‌ను సత్కరించారు పవన్.. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ సమావేశంలో.. ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు.. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందని.. పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని వెల్లడించారు పవన్ కల్యాణ్..
Read Also: CM Chandrababu: గిరిజన సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష..
ఇక, మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారని వెల్లడించిన పవన్ కల్యాణ్.. వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంలోనూ, ఉన్నత విద్యకు అమెరికా వెళ్లేవారికీ తగిన సహకారం, మార్గనిర్దేశనం అందించాలని కోరారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇక, పర్యావరణహితమైన కార్యక్రమాలకు ప్రోత్సాహం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూ.ఎస్. కాన్సల్ పొలిటికల్, ఎకనామిక్స్ విభాగం చీఫ్ ఫ్రాంక్ టాలుటో, ఆ విభాగం ప్రతినిధులు శ్రీమాలి కారే, సిబప్రసాద్ త్రిపాఠి పాల్గొన్నారు. కాగా, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరుసగా తన శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న పవన్ కల్యాణ్.. కీలక ఆదేశాలు జారీ చేస్తున్న విషయం విదితమే. గత ప్రభుత్వ హయాంలో ఆయా శాఖల్లో జరిగిన అవకతవకాలపై ఆరా తీస్తూ వస్తున్నారు పవన్ కల్యాణ్.