TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు.. వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు.. అయితే, తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ సరైన గుర్తింపు ఇవ్వడంలేదని విమర్శలు వచ్చాయి.. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను టీటీడీ అనుమతించకపోవడం వివాదాస్పదమైంది.. అంతేకాదు.. టీటీడీ తీరుపై విమర్శలు కూడా వచ్చాయి.. శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు తీసుకోవడం లేదు? అనే ప్రశ్నపై టీటీడీ ఈవో శ్యామల రావు ఆ మధ్య స్పందిస్తూ.. శ్రీవారి దర్శనానికి ఏపీ నుంచి వచ్చిన సిఫారసు లేఖలు మాత్రమే అనుమతిస్తున్నామని.. తెలంగాణ నుంచి సిఫార్సు లేఖలు తీసుకువస్తే.. చెల్లుబాటు కావని స్పష్టం చేశారు.. దీనిపై తెలంగాణ ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: UP: స్నేహితుడి ప్రియురాలి వీడియోలు దొంగిలించి బ్లాక్ మెయిల్.. బయటకు తీసుకెళ్లి ఏం చేశాడంటే..!
అయితే, ఈ మధ్యే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది.. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల అంశాన్ని పునఃపరిశీలించింది. బోర్డులోని మెజారిటీ సభ్యులు కూడా సిఫారసు లేఖలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. దీంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు వారానికి రెండు సార్లు అనుమతించేలా నిర్ణయం తీసుకున్నారు.. ఇక, ఈ రోజు సీఎం చంద్రబాబును కలిశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. ఇకపై తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు వారానికి రెండు సిఫార్సులేఖలకు అనుమతిస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయానికి అంగీకారం తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. వారానికి రెండు… రూ.3 వందల దర్శనానికి సిఫార్సులేఖలకు ఏపీ సీఎం అనుమతించారు.. దీంతో.. టీటీడీ, సీఎం చంద్రబాబు.. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు శుభవార్త చెప్పినట్టు అయ్యింది..