TDP Mahanaadu 2026: అమరావతి వేదికగా జరిగిన టీడీపీ ‘హైబ్రిడ్ మహానాడు-2026’లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినా, పొందకపోయినా.. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మహిళలకు 33 శాతం టికెట్లు కేటాయిస్తుందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్‌పై చర్చ జరుగుతున్న సమయంలో లోకేష్ చేసిన ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మహిళా శక్తిని మహాశక్తిగా గుర్తించిన నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడేనని లోకేష్ పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. మహిళల రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారత కోసం టీడీపీ నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు.
మహానాడు అంటే టీడీపీకి మాస్ జాతర అని వ్యాఖ్యానించిన లోకేష్.. “నేషన్ ఫస్ట్” అనేదే పార్టీ సిద్ధాంతమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సూచనల మేరకు ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. వర్చువల్ విధానంలో జరిగినప్పటికీ కార్యకర్తల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదని చెప్పారు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా “సీబీఎన్” అనే పేరు వినిపిస్తోందని, చంద్రబాబు ఇప్పటికీ జెట్ స్పీడ్‌తో పనిచేస్తున్నారని లోకేష్ కొనియాడారు. “అప్పుడు సైబరాబాద్ నిర్మించిన చంద్రబాబు.. ఇప్పుడు అమరావతిని నిర్మిస్తున్నారు” అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అని లోకేష్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం తమపై అనేక కేసులు పెట్టినా, కార్యకర్తలపై ఒత్తిడి తీసుకొచ్చినా పార్టీ వెనక్కి తగ్గలేదన్నారు. మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, “చేతులకు గాజులు తొడుకున్నారా” వంటి పదాలను నిషేధించామని చెప్పారు.
ఇక, రాష్ట్రంలో ఏడాదిలోనే 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని, అందులో పెద్ద సంఖ్యలో మహిళలకు ఉద్యోగావకాశాలు లభించాయని వెల్లడించారు మంత్రి నారా లోకేష్. ఎలాంటి అవకతవకలు లేకుండా డీఎస్సీ నిర్వహించామని తెలిపారు. మరోవైపు.. ప్రతిపక్షాలపై కూడా లోకేష్ వ్యాఖ్యలు చేశారు. “మాది గూగుల్.. మీది గొడ్డలి”, “మాది కీయా.. మీది కిడ్నాప్” అంటూ వైసీపీపై విమర్శలు గుప్పించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అహంకారానికి తావులేకుండా అందరూ కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మహానాడుకు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించిందని పార్టీ నేతలు తెలిపారు. ఇప్పటివరకు ఏపీ వ్యాప్తంగా వర్చువల్‌గా 2.25 లక్షల మంది హాజరయ్యారని, 1,875 క్లస్టర్లలో లక్ష మందికి పైగా కార్యకర్తలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెల్లడించారు. మూడు పార్టీల కూటమిగా ఏర్పడి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్నామని, భవిష్యత్తులో తెలంగాణ, అండమాన్ ప్రాంతాల్లో కూడా టీడీపీని బలోపేతం చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు.
