NTV Telugu Site icon

Heavy Rains in AP: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Rains

Rains

Heavy Rains in AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపు దూసుకొస్తుంది. ఇది బుధవారమే తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. రాబోయే 24 గంటల్లో వాయవ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్లనుంది. తర్వాత కోస్తా తీరం వెంబడి కదలనుంది. దీని ప్రభావంతో శుక్రవారం వరకు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాక (ఐఎండీ) పేర్కొంది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం చెబుతోంది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

Read Also: Devendra fadnavis: అజిత్ పవార్ ఏదొక రోజు సీఎం అవుతారు.. ఫడ్నవిస్ జోస్యం

ఇక, రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పలు ఏరియల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాపై అల్పపీడన ప్రభావం పడింది. జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన జల్లులు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరబెట్టిన ధాన్యాన్ని మిల్లులకు పంపే పనిలో పడ్డారు. ధాన్యం తడవకుండా రైతులు పాట్లు పడుతున్నారు. వాతావరణ పరిస్థితుల మేరకు నవంబర్‌, డిసెంబర్‌లో ఏర్పడే అల్పపీడనాలు తమిళనాడు సమీపంలో తీరం దాటతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతంలో తీరం దాటాల్సిన అల్పపీడనాలు తమిళనాడులో.. తమిళనాడులో తీరం దాటాల్సిన అల్పపీడనాలు ఏపీలో తీరం దాటుతున్నాయి. ఈ నెలాఖరున అండమాన్‌ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని సమాచారం ఉపగ్రహం నుంచి సమాచారం వస్తోంది.