Site icon NTV Telugu

RTA Special Drive in AP: ఆర్టీఏ స్పెషల్‌ డ్రైవ్.. ఏపీలో భారీగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల సీజ్..

Kurnool Bus Fire Incident

Kurnool Bus Fire Incident

RTA Special Drive in AP: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో ఆర్టీఏ అధికారులు అప్రమత్తం అయ్యారు.. ఇటు, తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌.. మరోవైపు బెంగళూరులోనూ ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.. దీంతో, కాలం చెల్లిన బస్సులను రోడ్డుపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాలు.. మరోవైపు.. కర్నూలులో బస్సు ప్రమాదం దృష్ట్యా ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు రవాణా శాఖ అధికారులు.. రవాణాశాఖ కమిషనర్‌ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రైవేట్‌ వాహనాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.. నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్‌ బస్సులపై ఈ రోజు ఇప్పటికే 289 కేసులు నమోదు చేశారు.. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 18 ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులను సీజ్‌ చేశారు..

Read Also: Lalu Prasad: ‘అబద్ధాల రాజు’.. డబుల్ ఇంజిన్ సర్కార్‌పై లాలూ ప్రసాద్ మండిపాటు

ఇక, విజయవాడలో ఇవాళ సాయంత్రం వరకు కొనసాగనున్నాయి ఆర్టీఏ అధికారుల తనిఖీలు.. అగ్నిమాపక పరికరాలు లేని ప్రైవేటు ట్రావెల్స్‌కు భారీగా జరిమానాలు విధిస్తున్నారు అధికారులు.. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులపై ఇప్పటి వరకు 7.08 లక్షల రూపాయల వరకు జరిమానా విధించారు.. అత్యధికంగా ఏలూరులో 55 కేసులు నమోదు కాగా.. 3 ట్రావెల్స్‌ బస్సులు సీజ్‌ చేశారు.. తూర్పు గోదావరి జిల్లాలో 17 కేసులు నమోదు కాగా.. 4 బస్సులు సీజ్‌.. కోనసీమ జిల్లాలో 27, చిత్తూరు జిల్లాలో 22, కర్నూలు జిల్లాలో 12, విశాఖలో 7, నంద్యాలలో 4 కేసులు నమోదు చేశారు అధికారులు.. సరైన ధ్రువపత్రాలు లేని 8 బస్సులు, అత్యవసర ద్వారం లేని 13 బస్సులు, ఫైర్‌ పరికరాలు లేని 103 బస్సులు, ప్యాసింజర్‌ లిస్టు లేని కారణంగా 34 బస్సులు, ఇతర ఉల్లంఘనలపై 127 బస్సులపై కేసులు నమోదయ్యాయి.. ఈ ప్రత్యేక డ్రైవ్‌ కొనసాగుతుందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.. మరోవైపు.. ఇప్పటికే విజయవాడ నుంచి బెంగళూరు, హైదరాబాద్‌ వైపు వెళ్లే పలు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బుకింగ్స్ రద్దు చేస్తున్నాయి పలు ట్రావెల్స్ సంస్థలు..

Exit mobile version