Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో కూటమిలో అధినేతల స్థాయిలో కో-ఆర్డినేషన్ సజావుగానే ఉన్నా గ్రౌండ్‌లో ఆ కలసికట్టుతనం స్పష్టంగా కనిపించటం లేదు. అధినేతలు ఒక్క మాట.. ఒక్క దారి అంటున్నా, స్థానిక కార్యకర్తలు, నాయకుల మధ్య విభేదాలు, పోటీ భావాలు ఇంకా తగ్గడం లేదు. NDA ప్రభుత్వం ఏర్పడి నెలలు గడిచినా.. నియోజకవర్గం నుంచి గ్రామ స్థాయి వరకు పాత తగాదాలు అలాగే కొనసాగుతున్నాయి. ఇన్నాళ్లుగా ఇవన్నీ సహజంగానే వదిలేశారు.. కానీ, స్థానిక సంస్థల ఎన్నికల కౌంట్‌డౌన్ మొదలవడంతో ఆ సమస్యలను సెటిల్ చేయాల్సిన అవసరం పెరిగింది. దీనితో పార్టీలు తమ బలం పెంచుకుంటూనే.. స్వంత నాయకుల అసంతృప్తిని కూడా చల్లార్చే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అలాంటి గ్యాప్‌లను పూడ్చే బాధ్యతను.. ఆరంభం నుంచే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీసుకుంటున్నారు. ఆయన ఒక అడుగు వెనక్కి వేసినా.. కూటమి రెండు అడుగులు ముందుకు రావాలని సందేశం ఇస్తున్నారు. విభేదాలు లేకుండా.. మూడు పార్టీలు కలిసి నడవాలనే పాఠాలు చెబుతున్నారు.
Read Also: Supreme Court: సుప్రీంకోర్టుకు ‘ఇండిగో సంక్షోభం’.. ఏం తీర్పు ఇవ్వనుందో..!
తాజాగా చిత్తూరు పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. డీడీవో కార్యాలయం ప్రారంభ వేడుకలో కూటమి నేతలను పక్కన కూర్చోబెట్టి స్పష్టమైన క్లాస్ ఇచ్చారు. మనమంతా ఒక్క తాటిపై ఉండాలి.. ఎన్నికల ముందు కాదు.. ఎన్నికల తర్వాత కూడా ఈ కూటమి బలంగా ఉండాలి అన్న సందేశాన్ని నేరుగా గ్రౌండ్ లోకి పంపే ప్రయత్నం చేశారు. అయితే, తాజాగా చిత్తూరులో పవన్ చేసిన వ్యాఖ్యలు అదే సంకేతాన్ని ఇస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. కూటమి ఐక్యతే రాష్ట్ర అభివృద్ధికి బలం అని చెప్పారు. ఈ స్పూర్తి మరో 15 ఏళ్లు కొనసాగితే సుస్థిర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. దిగజారిన వ్యవస్థలను నిలబెడుతున్నామని, ప్రజల గొంతుకగా మారాలని సూచించారు. కూటమి పార్టీల మధ్య చిన్న కమ్యూనికేషన్ గ్యాప్‌లు ఉంటే కూర్చొని మాట్లాడుకుందామని సూచించారు. కూటమి ప్రభుత్వానికి ఇంత బలం ఉండి.. వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే పదవులు ఉన్నా ఉపయోగం లేదని పవన్ స్పష్టం చేశారు.
మూడు పార్టీల భావజాలాలు వేర్వేరు అయినా.. రాష్ట్ర ప్రయోజనం కోసం ఒక గొడుగు కిందికి వచ్చామని తెలిపారు పవన్ కల్యాణ్.. కమ్యూనికేషన్ గ్యాప్‌లు, మనస్పర్థలు సహజమని.. ఒక్కసారి కూర్చొని మాట్లాడితే సమస్యలు తీరుతాయని అన్నారు. చిన్నగా మొదలైన కూటమి.. ఈ రోజు కేంద్రంలో NDAకి బలమైన శక్తిగా మారిందని చెప్పారు. ఈ రోజు పెద్దఎత్తున నామినేటెడ్ పోస్టులు ఇవ్వగలగడం మనందరి ఐక్యత వల్లేనన్నారు. అదే ఐక్యతతో మరో 15 ఏళ్లు కష్టపడితే రాష్ట్రానికి సుస్థిర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడూ గుర్తింపు కోసం పరిగెత్తలేదన్నారు. పదవి అనేది బాధ్యత… అలంకారం కాదని పవన్ సూచించారు. మొత్తంగా చూస్తే చిత్తూరు పర్యటనలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూటమి కోఆర్డినేషన్, ఐక్యత, భవిష్యత్ దిశ మీద స్పష్టమైన చర్చకు దారితీశాయి. స్థానిక స్థాయిలో ఉన్న గ్యాప్‌లను గుర్తించి వాటిని పరిష్కరించుకోవాలనే సూచనలు కూటమి పనిచేసే విధానంపై కొత్త దిశ చూపుతున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ సూచనలు గ్రౌండ్ స్థాయి నాయకులకు ఎంతవరకు చేరతాయి.. అవి ఎంతవరకు అమలవుతాయి.. అనేది ఇప్పుడు చూడాల్సిన విషయం.