Pawan Kalyan: నీట్ నిరసనలపై పవన్ కీలక వ్యాఖ్యలు.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: నీట్ (NEET) పరీక్షలకు సంబంధించిన ఆందోళనలపై జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ స్పందించారు. విద్యార్థుల సమస్యలతో ప్రారంభమైన ఈ ఆందోళనను కొందరు విభజనవాద, దేశ వ్యతిరేక శక్తులు దారి మళ్లించేందుకు ప్రయత్నించాయని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే నిరసనలను హింసాత్మకంగా మార్చే చర్యలు ఆందోళనకరమని పేర్కొన్నారు.

విద్యార్థుల నిరుద్యోగం, విద్యా సంబంధిత సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని పవన్ సూచించారు. విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని, వారి సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే, ప్రజాస్వామ్య నిరసన పేరుతో దేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేసే నినాదాలు చేయడం, హింసకు పాల్పడడం, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, మత విశ్వాసాలను అవమానించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని పవన్ స్పష్టం చేశారు.

ప్రజా ఉద్యమాలను దేశ వ్యతిరేక శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనలకు తన పూర్తి మద్దతు ఉంటుందని, అయితే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఎప్పటికీ వ్యతిరేకంగానే ఉంటానని పవన్ కల్యాణ్‌ తెలిపారు. అలాగే, జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) అమలుతో దేశ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సంస్కరణలను సానుకూలంగా స్వీకరించాలని సూచించారు.

చివరగా, ప్రతి ఒక్కరూ ‘నేషన్ ఫస్ట్’ అనే భావనతో దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు కృషి చేయాలని పవన్ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకునే సమయంలో దేశ ప్రయోజనాలకు భంగం కలగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌..