Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్‌ స్ట్రాంగ్ వార్నింగ్..

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రభుత్వం మరింత కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని డిప్యూటీ సీఎం, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో టాస్క్ ఫోర్స్ నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో రూ.2 కోట్ల విలువైన 109 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో నల్లాని నందకుమార్‌తో పాటు మరో ఇద్దరు స్మగ్లర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో భారీ స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్ బృందాన్ని పవన్ అభినందించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్రచందనం అక్రమ రవాణాలో గణనీయమైన తగ్గుదల నమోదైందని డిప్యూటీ సీఎం తెలిపారు. గత రెండేళ్లలో స్మగ్లింగ్ కార్యకలాపాలు 70 శాతం వరకు తగ్గాయని వెల్లడించారు. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో 90 శాతం మందికి పైగా శిక్షలు పడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర సంపదగా భావించే ఎర్రచందనం సరిహద్దులు దాటకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. అంతర్రాష్ట్ర సమన్వయంతో స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లపై ఉక్కుపాదం మోపుతున్నామని, అటవీ సంపద పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఎర్రచందనం అక్రమ రవాణాపై మరింత కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..