Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ

Sai Krishna Lockup Nhrc

Sai Krishna Lockup Nhrc

Sai Krishna Lockup Dea*th Case : విజయవాడలో జరిగిన సాయికృష్ణ కస్టడీ మృతి కేసుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణకు చెందిన హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఘటనను స్వీకరించిన కమిషన్, ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్‌కు వారం రోజుల్లో సమగ్ర యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని నోటీసులు జారీ చేసింది.

ప్రాథమిక సమాచారం, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నివేదికల ఆధారంగా అక్రమ నిర్బంధం, కస్టడీలో హింస జరిగి ఉండొచ్చని కనిపిస్తోందని NHRC పేర్కొంది. ఈ కేసులో ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు కూడా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని డిలీట్ చేసిన అంశంపై కూడా పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది.

బాధితుడి మృతదేహాన్ని దహనం చేసి, అస్థికలను నదిలో కలిపేశారనే ఆరోపణలపై కూడా కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. డిలీట్ చేసిన సీసీటీవీ ఫుటేజీని రికవర్ చేయడంతో పాటు, అవసరమైతే బాధితుడి అస్థికలను వెలికితీసే చర్యలు చేపట్టాలని సూచించింది. అలాగే బాధితుడి తల్లి గాదె విజయలక్ష్మికి తక్షణ రక్షణ, భద్రత కల్పించాలని రాష్ట్ర అధికారులను ఆదేశించింది. ఈ ఘటనలో కృష్ణలంక సీఐ నాగరాజుపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఆయనను సస్పెండ్ చేసి, SIT దర్యాప్తు నేపథ్యంలో రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొంది. ఎఫ్‌ఐఆర్ ప్రస్తుత స్థితి, నిందితులపై తీసుకున్న చర్యలు, బాధిత కుటుంబానికి పరిహారం, దర్యాప్తు పురోగతిపై సమగ్ర నివేదికను వారం రోజుల్లో సమర్పించాలని NHRC స్పష్టం చేసింది. ఈ ఘటన జీవించే హక్కుపై తీవ్రమైన ఉల్లంఘనగా కనిపిస్తోందని పేర్కొన్న కమిషన్, చట్టాన్ని అమలు చేయాల్సిన సంస్థలే చట్టాన్ని ఉల్లంఘించే పరిస్థితులు ప్రజాస్వామ్యానికి ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. కేసులో పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించింది.