NTV Telugu Site icon

Building Permissions: భ‌వ‌న నిర్మాణాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేవారికి గుడ్‌న్యూస్‌.. సింగిల్ విండో ద్వారా అనుమతులు..!

Narayana

Narayana

Building Permissions: భ‌వ‌న నిర్మాణాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే వారికి త్వరిత‌గ‌తిన అన్ని అనుమ‌తులు మంజూరయ్యేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని సంబంధిత అధికారులను ఆదేశించారు ఏపీ మున్సిప‌ల్ మ‌రియు ప‌ట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ.. భ‌వ‌నాల నిర్మాణాల కోసం అనుమ‌తులిచ్చే శాఖ‌ల అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు మంత్రి.. ఈ సమావేశానికి పుర‌పాల‌క శాఖ క‌మిష‌న‌ర్ మ‌రియు డైరెక్టర్ హ‌రినారాయ‌ణ‌న్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్‌ల శాఖ ఐజీ శేష‌గిరి బాబుతో పాటు ప‌ట్టణ ప్రణాళిక విభాగం, రెవెన్యూ, గ‌నులు, అగ్నిమాప‌క శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పటి వ‌ర‌కూ ఆయా శాఖ‌ల వారీగా అనుమ‌తులు జారీ చేస్తున్న విధానం… అనుమ‌తుల మంజూరుకు తీసుకుంటున్న గ‌డువు వంటి అంశాల‌ను అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి నారాయ‌ణ‌.. అన్ని శాఖ‌ల‌ను ఆన్ లైన్ విధానంలో అనుసంధానం చేసేలా అవ‌స‌ర‌మైన సాంకేతిక ప‌రిజ్జానాన్ని అందుబాటులోకి తీసుకురావాల‌ని సూచించారు.. ఇక, భ‌వ‌న నిర్మాణాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు ఆయా శాఖ‌ల‌కు వేర్వేరుగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి వ‌స్తుంది. దీనివ‌ల్ల ఒక్కోశాఖ నుంచి అనుమ‌తి రావ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది.. ఈ జాప్యాన్ని త‌గ్గించేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్యలు చేప‌ట్టాల‌ని స్పష్టం చేశారు.

Read Also: Jammu Kashmir Assembly Polls: నేడు జమ్మూకశ్మీర్కు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే

అయితే, భ‌వ‌న నిర్మాణాల‌ కోసం అగ్నిమాప‌క శాఖ అనుమ‌తి ఇవ్వాల్సి ఉంటుంది.. దీనికోసం ప్రస్తుతం ప‌రిశ్రమ‌ల‌కు ఇస్తున్న ఆన్ లైన్ అనుమ‌తుల అప్లికేష‌న్ ను DPMS వెబ్ సైట్ కు అనుసంధానం చేస్తే స‌రిపోతుంద‌ని సూచించారు.. ఇక గ‌నుల శాఖ కూడా పెద్దపెద్ద భ‌వ‌నాల విష‌యంలో అనుమ‌తులు జారీ చేయాల్సి ఉంటుంది.. భ‌వ‌న నిర్మాణాల కోసం భారీ గుంత‌ల తవ్వకాల కోసం గ‌నుల శాఖ అనుమ‌తి త‌ప్పనిస‌రి.. దీనికి సంబంధించి సీన‌రేజి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.. ప‌రిశ్రమ‌ల‌కు అనుమ‌తుల విష‌యంలో ప్రస్తుతం ఇదే ర‌క‌మైన విధానాన్ని పాటిస్తున్నారు.. ఈ విధానాన్నే భ‌వ‌న నిర్మాణాల అనుమ‌తుల‌కు అనుసంధించేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని సూచించారు మంత్రి నారాయణ.. మ‌రోవైపు, భ‌వ‌నం నిర్మాణం స‌మ‌యంలోనే ఎంత‌మేర ఇసుక అవ‌స‌రం అవుతుంద‌నేది కూడా త‌మ‌కు ఇవ్వాల‌ని గ‌నుల శాఖ అధికారులు కోరారు.. దీనికి అవ‌స‌ర‌మైన చ‌ర్యలు తీసుకోవాల‌ని ప్రజారోగ్య శాఖ చీఫ్ ఇంజినీర్ గోపాల కృష్ణా రెడ్డికి సూచించారు. ల్యాండ్ కన్వర్షన్ కు సంబంధించి కూడా రెవెన్యూ అధికారులు ఇచ్చే అనుమ‌తులు సుల‌భ‌త‌రం చేయాల‌ని నిర్ణయించారు.. దీంట్లో భాగంగా ఇప్పటికే ప‌రిశ్రమ‌ల శాఖ‌కు ఇస్తున్న విధానాన్ని ఏకీకృతం చేయాల‌ని నిర్ణయించారు. ఆయా శాఖ‌ల స‌మ‌న్వయంతో సింగిల్ విండో ద్వారా అనుమ‌తులు జారీ చేసేలా వీలైనంత త్వర‌గా చ‌ర్యలు తీసుకోవాల‌ని సూచించారు మంత్రి నారాయ‌ణ.