Site icon NTV Telugu

Minister Nara Lokesh: తాజా రాజకీయ పరిణామాలపై మంత్రి లోకేష్‌ సీరియస్‌..! మీరు ఏం చేస్తున్నారు..?

Lokesh

Lokesh

Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలు తగిన విధంగా స్పందించకపోవడంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన లోకేష్‌.. అందుబాటులో ఉన్న కీలక నేతలతో ప్రత్యేకంగా సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిణామాలపై సమీక్ష నిర్వహించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు సమర్థవంతంగా ప్రతిస్పందించకపోవడంపై లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. “నకిలీ మద్యం కేసులో అరెస్టైన వైసీపీ నేత జోగి రమేష్ బీసీ కార్డు వాడుకుంటున్నా, మన సీనియర్ నేతలు ఎందుకు స్పందించడంలేదు?” అని లోకేష్ ప్రశ్నించినట్టు సమాచారం.

Read Also: Diwali Bumper Lottery: అదిగదిగో లచ్చిందేవి.. కూరగాయలు అమ్మే వ్యక్తికి కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే..

ఇక, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పై కూడా మంత్రి లోకేష్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. “మీ కోసం సుబ్బనాయుడు గారు సీటు త్యాగం చేశారు, ఆయన మరణించినప్పుడు ఎందుకు వెళ్లలేదని” కావ్యను ప్రశ్నించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే, టీడీపీలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం రచ్చగా మారిన నేపథ్యంలో, ఇద్దరు నేతలు పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. కమిటీ కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు తీసుకున్నట్లు సమాచారం. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నివేదికను మంత్రి లోకేష్‌కు, ఆపై చంద్రబాబుకు అందజేయనుంది. ఆ నివేదిక ఆధారంగా ఇద్దరు నేతలపై పార్టీ తీసుకునే చర్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Exit mobile version