NTV Telugu Site icon

Liquor Sales: మందుబాబులకు ఏపీ సర్కార్‌ శుభవార్త.. అర్ధరాత్రి వరకు లిక్కర్‌ అమ్మకాలు

Ap Liquor Scam

Ap Liquor Scam

Liquor Sales: మందుబాబులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. 2024కు గుడ్‌బై చెప్పి.. 2025కి స్వాగతం పలికేందుకు అంతా స్వాగతం సిద్ధం అవుతోన్న తరుణంలో.. మద్యం అమ్మకాలు జోరుగా సాగుతాయనే అంచనాలు ఉన్నాయి.. అయితే, మద్యం అమ్మకాలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అర్ధరాత్రి వరకు లిక్కర్ సేల్స్‌కు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.. నూతన సంవత్సరం సందర్భంగా మద్యం అమ్మకాల సమయాన్ని ఎక్సైజ్‌ శాఖ పెంచింది. మద్యం షాపులు, బార్లు, క్లబ్‌లు, ఈవెంట్లకు రాత్రి ఒంటిగంట వరకు అనుమతిచ్చింది. సాధారణంగా ప్రతీరోజు రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయి. అయితే, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మద్యం వినియోగం ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో.. మద్యం షాపులు, బార్లు అందుబాటులో లేకపోతే మందుబాబులు బెల్టు షాపుల్లో అధిక ధరలకు మద్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని భావించిన ప్రభుత్వం.. అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం అమ్మకాలను అనుమతి ఇచ్చింది.. డిసెంబర్‌ 31వ తేదీతో పాటు.. జనవర్‌ 1వ తేదీన కూడా అర్ధరాత్రి 1 గంటల వరకు మద్యం అమ్మకాలను అనుమతి ఇచ్చింది సర్కార్.. అయితే, ఇప్పటికే బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరిగితే బెల్ట్‌ తీస్తానంటూ సీఎం చంద్రబాబు హెచ్చరించిన విషయం విదితమే..

Read Also: Kawasaki KLX 230: స్టన్నింగ్ లుక్స్‌తో భారత మార్కెట్లో విడుదలైన కవాసకి డ్యూయల్-స్పోర్ట్ మోటార్‌సైకిల్‌

కాగా, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లిక్కర్ సేల్స్‌ భారీగా పెరిగినట్టు ఎక్సైజ్‌ శాఖ చెబుతోంది.. ప్రైవేట్ లిక్కర్‌ షాపులు అందుబాటులోకి వచ్చిన తర్వాత అంటే.. ఈ ఏడాది అక్టోబర్‌ 16వ తేదీ నుంచి డిసెంబర్‌ 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,312 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు ఏపీ ఎక్సైజ్‌ శాఖ ప్రకటించింది.. ఈ 75 రోజుల కాలంలో 26,78,547 కేసులు బీర్ల అమ్మకాలు సాగగా.. 83,74,116 కేసుల మద్యం అమ్మినట్టు చెబుతున్నారు. బార్లు, వైన్ షాపులకు కలిపి ఈ అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.. ఇక, డిసెంబర్ 31, జనవరి 1కి సంబంధించి వచ్చిన ఇండెంట్ బట్టి ఈ రోజుకి ఆరోజు సరుకు పంపుతున్నట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు..

Show comments