Janasena MP Balashowry: ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇస్తామన్నారని జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి వెల్లడించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు 200 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పూర్తి ఖర్చు కేంద్రం భరిస్తుందని చెప్పారని ఆయన తెలిపారు. దేశానికి ఆహార భద్రత కల్పించాలి అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి అని కేంద్ర మంత్రి చెప్పారన్నారు. పునరావాసం సహా మొత్తం ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు.
Read Also: Srisailam Project: కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం
ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా వేల కోట్ల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎంపీ పేర్కొన్నారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఇచ్చిన హామీలను పూర్తి చేస్తామన్నారని.. చట్టం ప్రకారం చమురు శుద్ధి కేంద్రం, స్టీల్ ప్లాంట్ కూడా రావాల్సి ఉందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు సంయుక్తంగా సాధించిన విజయమని ఎంపీ బాలశౌరి స్పష్టం చేశారు. ఎన్డీఏ ఆర్కిటెక్ట్‌గా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ విజయంలో కీలకపాత్ర పోషించారన్నారు. ఏపీ ప్రజలు ఎంతో కాలంగా తమ రాజధాని కోసం ఎదురుచూస్తున్నారని.. వారి కల నెరవేరబోతోందన్నారు. జనసేన తరఫున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.