NTV Telugu Site icon

Ram Gopal Varma: ఆర్జీవీకి థర్డ్‌ డిగ్రీ టెన్షన్‌..! ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

Rgv

Rgv

Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో విచారణకు రానుంది.. హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు ఆర్జీవీ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌పై గతంలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారన్న ఫిర్యాదుతో రాంగోపాల్‌ వర్మపై కేసు నమోదు చేశారు ప్రకాశం జిల్లా పోలీసులు.. పోలీసులు నోటీసులు ఇవ్వగా.. తొలి విచారణకు డుమ్మాకొట్టారు ఆర్జీవీ.. ఇక, తాజాగా మరో నోటీసు కూడా జారీ చేశారు.. అయితే, మొదట తనపై నమోదైన కేసును క్వాష్‌ చేయాలని హైకోర్టును ఆశ్రయించిన రాంగోపాల్‌ వర్మకు ఎదురుదెబ్బ తగిలింది.. దీంతో.. మరోసారి హైకోర్టు మెట్లు ఎక్కిన ఆయన.. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.. తనపై థర్డ్ డిగ్రీ కూడా పోలీసులు ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.. ఇప్పటికే వర్మ క్వాష్ పిటిషన్ వేయగా తోసి పుచ్చిన హైకోర్టు.. నేడు ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది.

Read Also: Game Changer : ‘గేమ్ ఛేంజర్’ మూడో సింగిల్ సాంగ్‌పై క్రేజీ అప్డేట్

కాగా, దర్శకుడు రాంగోపాల్‌వర్మకు మరోసారి నోటీసులు జారీ చేశారు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఈ నెల 25వ తేదీన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకి హాజరుకావాల్సింది ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీసులు పంపించారు.. దర్శకుడు రాంగోపాల్ వర్మ వాట్సప్ నంబర్‌కు సంబంధిత నోటీసు పంపించారు సీఐ శ్రీకాంత్. అయితే, ముందుగా జారీ చేసిన నోటీసు ప్రకారం మంగళవారం (ఈ నెల 19వ తేదీన) విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. వారం రోజులు గడువు కోరారు రాంగోపాల్ వర్మ.. ఈ మేరకు నిన్న ఉదయం సీఐకి వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టిన విషయం విదితమే.. ఇక, ఆ తర్వాత వర్మ తరఫు న్యాయవాదులు కూడా వచ్చి ఒంగోలు రూరల్‌ పోలీసులకు ఈ సమాచారాన్ని ఇచ్చారు.. మరోవైపు.. తనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయలని హైకోర్టులో మొదట పిటిషన్‌ దాఖలు చేశారు.. ఇక, ఆర్జీవీ పిటిషన్‌పై సోమవారం రోజు విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది.. అరెస్ట్‌పై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని స్పష్టం చేసింది.. మంగళవారం విచారణ హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారని పిటిషన్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. హాజరు అయ్యేందుకు మరి కొంత సమయాన్ని ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని వర్మ తరపు న్యాయవాది అభ్యర్థించారు.. ఇక, సమయం పొడిగించాలనే అభ్యర్థనను పోలీసులు ముందు చేసుకోవాలని సూచించింది హైకోర్టు.. ఇటువంటి అభ్యర్థన కోర్టు ముందు కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.. ఆ తర్వాత విచారణకు డుమ్మ కొట్టారు ఆర్జీవీ.. మరోసారి పోలీసులు నోటీసు ఇవ్వడంతో.. ఇవాళ హైకోర్టులో ఎలాంటి వాదనలు కొనసాగుతాయి.. వర్మకు బెయిల్‌ వస్తుందా? లేదా? లేక పోలీసు విచారణకు హాజరవుతారా? అనేది ఉత్కంఠగా మారింది.

Show comments