NTV Telugu Site icon

Liquor Prices: పండుగ పూట మందుబాబులకు గుడ్‌ న్యూస్‌..

Liquor

Liquor

Liquor Prices: మందుబాబులకు పండుగ వేళ గుడ్ న్యూస్‌.. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు తగ్గుతున్నాయి. కూటమి నేతలు ఎన్నికల సమయంలో తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త మద్యం పాలసీ అమల్లోకి తెచ్చారు. అందులో భాగంగానే 99 రూపాయలకే క్వార్టర్ మద్యం విక్రయిస్తున్నారు. దీనికి భారీ డిమాండ్ ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 16 కంపెనీలకు చెందిన మద్యం ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పది బ్రాండ్ల ధరలు ఇప్పటికే తగ్గించారు. మరో ఆరు కంపెనీలు ధరలు తగ్గించేందుకు ముందుకు వచ్చాయి. తగ్గించిన ధరలతోనే కంపెనీలు మద్యం సరఫరా చేస్తున్నాయి.

Read Also: Clashes in Cockfighting: కోడి పందాల్లో ఉద్రిక్తత.. బీరు సీసాలతో వీరంగం.. పగిలిన తలలు..

మరోవైపు, ధరల తగ్గింపుతో మరింతగా సేల్స్ పెంచుకోవాలని భావిస్తున్నాయి మద్యం కంపెనీలు. ప్రముఖ కంపెనీలు ధరలు తగ్గించటంతో ఇతర కంపెనీలపైనా ఒత్తిడి పెరిగింది. దీంతో మరొకొన్ని కంపెనీలు సైతం ఇప్పుడు ధరల తగ్గింపునకు ముందుకు వస్తున్నాయి. మార్కెట్‌లో ధరలు తగ్గించిన కంపెనీల బ్రాండ్ల అమ్మకాలు పెరిగాయి. ఇదే సమయంలో అధిక ధరలు విక్రయాలు చేసినా.. బెల్టు షాపులు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ఫలితంగా మద్యం విక్రయాలపై నిఘా పెరిగింది. లిక్కర్‌ బ్రాండ్లలో క్వార్టర్‌పై 20 నుంచి 80 రూపాయల వరకు ధరలు తగ్గుతున్నట్లు చెబుతున్నారు అధికారులు. మాన్సన్‌ హౌస్‌ కంపెనీ క్వార్టర్‌పై 30 రూపాయలు తగ్గించింది. అరిస్ర్టోకాట్‌ ప్రీమియం సుపీరియర్‌ విస్కీ ధర ఏకంగా 50 రూపాయలు తగ్గింది. కింగ్‌ఫిషర్‌ బీరు 10 రూపాయలు తగ్గింది. బ్యాగ్‌పైపర్‌ గోల్డ్‌ రిజర్వ్‌ విస్కీ ఒకేసారి 80 రూపాయలు తగ్గించుకునేందుకు దరఖాస్తు చేసింది. ఐతే, కంపెనీలు ధరలు తగ్గించుకోవడం వల్ల ప్రభుత్వానికి వచ్చే పన్నులు తగ్గుతాయనే వాదన ఉంది. కంపెనీల కంటే ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గుతుందని చెబుతున్నారు. మందుబాబులు మాత్రం ధరల తగ్గింపుతో ఖుషీగా ఉన్నారు.

Show comments