Site icon NTV Telugu

Nara Lokesh: లోకేష్‌ ప్రమోషన్‌ని కావాలనే పెండింగ్‌లో పెట్టారా..?

Lokesh

Lokesh

Nara Lokesh: కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ లోకేష్‌ కనుసన్నల్లోనే నడుస్తోంది. మంత్రిగా ఉంటూనే పార్టీ వ్యవహారాలను లోకేష్ దగ్గరుండి చూసుకుంటూ ఉన్నారు. మహానాడు మొత్తాన్ని లోకేష్ దగ్గరుండి నడిపించారనే అభిప్రాయం కూడా బలంగా ఉంది. వేదికను ఎంపిక చేయడం దగ్గర్నుంచి… కమిటీల ఏర్పాటు దాకా లోకేష్ పాత్ర స్పష్టంగా కనిపించింది. మహానాడు వేదిక మీద చాలామంది సీనియర్ నేతలు లోకేష్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌తో పాటు మంత్రి పయ్యావుల కేశవ్‌, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ధూళిపాల నరేంద్రలాంటివారు లోకేష్‌కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని బలంగా తమ వాణి వినిపించారు. కానీ… అలాంటిదేమీ జరగలేదు. మహానాడులో చంద్రబాబుని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం మినహాయించి ఎవరికీ ఎలాంటి పదవులు ఇవ్వలేదు. లోకేష్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌షిప్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే మహానాడు ముగిసింది.

Read Also: Hyderabad: తల్లి బర్త్ డే వేడుకలు జరుపుకునేందుకు వెళ్తే.. దారుణ హత్యకు గురైన కొడుకు.. అసలు ఏం జరిగిందంటే?

మహానాడులో చంద్రబాబును టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అదే సమయంలో లోకేష్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగిస్తే తండ్రీకొడుకులు కలిసి పదవులు తీసుకున్నారనే అభిప్రాయం బలంగా జనంలోకి వెళ్తుంది. అందుకే… ఇది కరెక్ట్‌ టైమ్‌ కాదు అని భావించినట్టు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర కమిటీలు, పొలిట్ బ్యూరోల్లో మార్పులు చేసినప్పుడే లోకేష్‌కి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి ఇస్తారనే చర్చ మరోవైపు జరుగుతోంది. మహానాడులోనే ఇవ్వాలని నిబంధన లేదు కాబట్టి తర్వాత కూడా లోకేష్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే ప్రస్తుతానికి వర్కింగ్ ప్రెసిడెంట్ పెండింగ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది.

Read Also: Hyderabad: తల్లి బర్త్ డే వేడుకలు జరుపుకునేందుకు వెళ్తే.. దారుణ హత్యకు గురైన కొడుకు.. అసలు ఏం జరిగిందంటే?

ప్రస్తుతం… అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ… లోకేష్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో పార్టీలోకి యువ రక్తం కావాలని లోకేష్ కోరుకుంటున్నారు. దీంతో మార్పులు తప్పనిసరిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే లోకేష్‌కు పదవి ఇచ్చిన తర్వాత పార్టీ మీద మరింత ఎక్కువగా ఫోకస్ పెడతారనే చర్చ కూడా జరుగుతోంది. లోకేష్‌కు ప్రమోషన్‌ అంశాన్ని పార్టీ అధినేత చంద్రబాబు కావాలనే పెండింగ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. తనతో పాటు లోకేష్ కూడా పదవి తీసుకుంటే ఒక ఇంట్లోనే ఇద్దరూ పదవులు తీసుకున్నారనే చర్చ జరుగుతుందని చంద్రబాబు గ్రహించారు. దాంతో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంటుందని బాబు ఆలోచించినట్టుగా సమాచారం. కొంతమందికి పదవులు ఇచ్చి కొన్ని మార్పులు చేసిన తర్వాత పనిలోపనిగా లోకేష్‌కు కూడా కీలక బాధ్యతలు అప్పగిస్తారని పొలిటికల్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటే ఆగస్ట్‌ లోపు లోకేష్‌ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం ఖాయమనే మాట వినిపిస్తోంది.

Exit mobile version