Site icon NTV Telugu

Cyclone Montha: తుఫాన్‌ అనంతర చర్యలు అత్యంత కీలకం.. యుద్ధ ప్రాతిపదికన పని చేయాలి..

Pawan Kalyan

Pawan Kalyan

Cyclone Montha: మొంథా తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాం.. ఇప్పుడు తుఫాన్‌ అనంతర చర్యలు అత్యంత కీలకమైనవి. ఈ సమయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖలు యుద్ధ ప్రాతిపదికన పని చేయాలి.. పటిష్టమైన ప్రణాళికతో, సమన్వయంతో పనిచేయాలి. తుఫాను, భారీ వర్షాలు తగ్గాక గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య, తాగునీటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఎక్కడా ఇబ్బందులు లేకుండా దీనిని సమర్థవంతంగా పరిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉందని డిప్యూడీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అధికారులకు సూచించారు. తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న గ్రామాల్లో సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్ కార్యక్రమాలను మొదలుపెట్టాలన్నారు. తుఫాన్‌ ప్రభావం వల్ల పాడైన రోడ్లను ప్రాధాన్య ప్రకారం బాగు చేయాలన్నారు. మొంథా తుఫాన్‌ అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై పవన్ కళ్యాణ్.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన చర్యలను తక్షణమే మొదలుపెట్టాలని సూచించారు.

Read Also: Baahubali The Epic : బాహుబలి సినిమా వద్దన్న రాజమౌళి.. అతని వల్లే చేశారంట

1583 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు అధికారులు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యా్‌ణ్‌కు తెలియచేశారు. శానిటేషన్ సిబ్బందిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకున్నామని చెప్పారు. 38 చోట్ల రోడ్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయనీ, మరో 125 చోట్ల రహదారులకు గుంతలు ఏర్పడ్డాయని వివరించారు. రక్షిత తాగు నీటి పథకాల ట్యాంకులు దగ్గర క్లోరినేషన్ ప్రక్రియ చేస్తున్నామన్నారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “తాగు నీటిని అందించే పథకాలకు, నీటి సరఫరాకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రత్యామ్నాయం చూడాలి. ఈ చర్యలు తక్షణమే తీసుకోవాలి. గ్రామాల్లో మొబైల్ శానిటేషన్ బృందాలను సిద్ధంగా ఉంచాలి. 21,055 మంది పారిశుద్ధ్య సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేసి పారిశుద్ధ్య మెరుగుదలకు వెంటనే చర్యలు చేపట్టండి. వాన నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో నీటిని బయటకు పంపించే చర్యలు తీసుకోవాలి. నీరు ఎక్కడ కలుషితం కాకుండా, వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ తరుణంలో దోమల వల్ల వచ్చే వ్యాధులు పెరుగుతాయి. వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకొని గ్రామాల్లో వ్యాధులు రాకుండా అరికట్టాల్సిన బాధ్యత తీసుకోండి. మూడు, నాలుగు రోజుల పాటు పారిశుద్ధ్య నిర్వహణపై పూర్తిగా దీనిపై దృష్టి సారించండి. మళ్లీ సాధారణ పరిస్థితి వచ్చే వరకు గ్రామాల్లో నిరంతరం పారిశుద్ధ్య మెరుగుదలకు చర్యలు తీసుకోవాలి. దీనిలో ఎక్కడ లోటుపాట్లకు తావు ఉండకూడదు. దెబ్బ తిన్న రహదారుల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టాలి అన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

Exit mobile version