Cyclone Alert: బంగాళాఖాతంలో మరో తుఫాన్‌.. ‘దిత్వా’గా నామకరణం.. ఏపీకి భారీ వర్ష సూచన..

  • నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తుపాన్..
  • తుపాన్ కు 'దిత్వా' గా నామకరణం..
  • గడిచిన 6 గంటల్లో 15 కి.మీ వేగంతో కదిలిన తుపాన్..
  • ఆదివారం తెల్లవారుజాముకి నైరుతి బంగాళాఖాతం తమిళనాడు, పుదుచ్చేరి..
  • దక్షిణకోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ..
  • దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు
Cyclone Ditwah

Cyclone Ditwah

Cyclone Alert: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రంగా మారి తుఫాన్‌గా మారిందని.. దానికి ‘దిత్వా’గా నామకరణం చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. గడిచిన 6 గంటల్లో 15 కిలో మీటర్ల వేగంతో కదులుతూ తుపాన్ ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)కు 200 కిలో మీటర్లు.. పుదుచ్చేరికి 610 కిలో మీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా సుమారు 700 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది..

Read Also: Imran Vs Asim: ఒక్క సంతకం.. ఇమ్రాన్‌కు మరణశాసనం!

అయితే, వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ తుపాన్ ఆదివారం తెల్లవారుజామున తీరాన్ని తాకనుంది.. ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాలకు చేరువలో తీరం దాటే అవకాశం ఉండగా… ఏపీలో వర్షాలు, గాలుల ప్రభావం పెరుగుతుందని అంచనా వేసింది.. ఇక, తుపాన్ ప్రభావంతో శనివారం మరియు ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.. తీరం ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని.. సముద్రం ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

ఈ సమయంలో ప్రజలు–రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు సూచనలు జారీ చేసింది.. ఈ సమయంలో సముద్రానికి వెళ్లవద్దు.. మత్స్యకారులు చేపల వేటకు బయలుదేరకుండా ఉండాలి.. తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తలు పాటించాలి.. వరి, పత్తి, మిరప తదితర పంటల రైతులు వెంటనే రక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొంది.. తుపాన్ తీరానికి చేరే వరకు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.