Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు

Minister Narayana

Minister Narayana

Minister Narayana: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించినట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.. సీఆర్డీఏ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడన మంత్రి నారాయణ.. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్‌కు సంబంధించిన ప్రతిపాదనలను సమావేశంలో ఆమోదించినట్లు వెల్లడించారు. పల్నాడు జిల్లాలోని ఇనాం భూముల స్వాధీనానికి అవసరమైన నిధులను దేవాదాయ శాఖకు అందించేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు.

ఇక, హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టుకు సంబంధించి రేరా ఫీజు చెల్లింపునకు కూడా సీఆర్డీఏ ఆమోదం తెలిపిందన్నారు మంత్రి నారాయణ.. అలాగే భూములు ఇచ్చిన రైతులకు యాన్యుటీ చెల్లింపుపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మరోవైపు.. విజయవాడ రైల్వే స్టేషన్, బస్టాండ్, కనకదుర్గమ్మ ఆలయం, భవానీ ఐలాండ్ నుంచి వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు రోప్‌వే ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. కృష్ణా నదిపై అవసరమైన వంతెనల నిర్మాణానికి సంబంధించి కమిటీ ఏర్పాటు చేయాలని కూడా సమావేశంలో నిర్ణయించినట్లు వెల్లడించారు మంత్రి నారాయణ.. కాగా, గత ప్రభుత్వ హయాంలో పూర్తి నిలిచిపోయిన అమరావతి రాజధాని పనులు.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేగంగా సాగుతోన్న విషయం విదితమే.. ఇక, సీఆర్డీఏ సమావేశం అవుతూ.. చేపట్టాల్సిన పనులపై చర్చిస్తూ.. నిర్ణయాలు తీసుకుంటూ.. ఆ పనులు మరింత వేగంగా సాగేలా చర్యలు తీసుకుంటుంది..