CM Chandrababu: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియా కేసులు నమోదైన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. గ్రామంలోని పరిస్థితులను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీఎంకు వివరించారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు గ్రామంలోని ఆరుగురికి డయేరియా లక్షణాలు కనిపించగా, వారికి వెంటనే వైద్య సహాయం అందించడంతో పాటు టెక్కలి ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మరో ముగ్గురు ఆసుపత్రిలో చేరగా, మొత్తం బాధితుల్లో ఐదుగురు ఇంకా చికిత్స పొందుతున్నారని, ముగ్గురు రోగులు డిశ్చార్జ్ అయ్యారని అధికారులు వివరించారు.
ఈ ఘటనలో 70 ఏళ్ల చిన్నారావు అనే వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే, చిన్నారావు మరణానికి డయేరియా కారణం కాదని, ఆయన ముందుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారని, మల్టీ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ వల్ల గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని అధికారులు స్పష్టం చేశారు. ఇక, గ్రామంలో ఉన్న ఒక బావి నుంచి ఐదు పబ్లిక్ కుళాయిలకు నీరు సరఫరా అవుతుండగా, మరో రెండు చేతి పంపుల ద్వారా కూడా త్రాగునీరు అందుతోందని అధికారులు వివరించారు. ఈ నీటి నమూనాలను గ్రామీణ జలవనరుల శాఖ (RWS) పరీక్షించగా, నీటిలో ఎక్కడా కలుషితం లేదని, తాగడానికి సురక్షితమని తేలినట్లు తెలిపారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా బావి నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసి, ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
Read Also: Andhra Pradesh: మా రాజీనామాలు ఆమోదించండి.. మండలి చైర్మన్‌కు ఎమ్మెల్సీల విజ్ఞప్తి..!
అయితే, డయేరియా కేసులు ఎందుకు వెలువడుతున్నాయో ఖచ్చితమైన కారణాన్ని గుర్తించాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశించారు. గ్రామంలో సరఫరా అవుతున్న నీటిలో మలినాలు కలుస్తున్నాయా? లేదా ఇతర కారణాల వల్లా ఈ సమస్య వస్తుందా? అన్నది స్పష్టంగా గుర్తించాలి” అని సీఎం సూచించారు. డిప్యూటీ DMHO, ఎపిడెమియాలజిస్ట్ గ్రామంలోనే ఉండి పరిస్థితులను పరిశీలిస్తున్నారని అధికారులు తెలిపారు. వైద్య బృందాలు ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాయని వివరించారు. తాళ్లవలసతో పాటు పరిసర గ్రామాల్లో కూడా పరిశుభ్రత, త్రాగునీటి నాణ్యతపై పర్యవేక్షణ పెంచాలని, ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చద్రబాబు నాయుడు..
