CM Chandrababu: తుఫాన్‌ను ఎదుర్కోవడంలో దేశానికే ఏపీ ఆదర్శం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Babu

Babu

CM Chandrababu: ఓ వైపు తుఫాన్లు వణికిస్తే.. మరోవైపు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో హీట్‌ పెంచాయి.. అయితే, ప్రజల ప్రాణాలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రధాన అజెండా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకే తాను తొలి ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా వరుసగా రెండు తుపాన్లను ఎదుర్కొన్నామని, మొదట అర్నబ్ తుపాను, ఆ వెంటనే మురసు తుపాను రావడంతో అనేక సవాళ్లు ఎదురయ్యాయని వెల్లడించారు. తుపాను పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు, విద్యుత్ పునరుద్ధరణ, నష్టాల అంచనా, ప్రజలకు అందించిన సేవలపై ఆయన వివరించారు.

ప్రాణరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
అక్టోబర్ 27న అర్నబ్ తుపాను రాకతో ప్రభుత్వం భారీ స్థాయిలో అప్రమత్తమైందని చంద్రబాబు తెలిపారు. స్వర్ణగ్రామం నుంచి రాష్ట్రస్థాయి యంత్రాంగం, సచివాలయం వరకు ప్రతి విభాగాన్ని ముందుగానే అప్రమత్తం చేశామని చెప్పారు. సహాయక చర్యల కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి, రెస్క్యూ, పునరావాసం, సహాయక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటం, ఆస్తి నష్టాన్ని తగ్గించడం, సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడమే లక్ష్యంగా పనిచేశామని వివరించారు. ప్రతి తుపాను కదలికను పరిశీలించామని, చివరి గ్రామం వరకు పరిస్థితిని సమీక్షించామని తెలిపారు. లోతట్టు ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. ప్రతి గంటకూ తుపాను సమాచారాన్ని ప్రజలకు అందిస్తూ అప్రమత్తం చేశామని వెల్లడించారు. గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు, రోగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని తెలిపారు.

RTGS, వాతావరణ వ్యవస్థలతో నిరంతర పర్యవేక్షణ
RTGS ద్వారా తుపాను పరిస్థితులను సమర్థవంతంగా పర్యవేక్షించామని సీఎం తెలిపారు. భారత వాతావరణ శాఖ (IMD)తో పాటు వివిధ తుపాను ట్రాకింగ్ వ్యవస్థల నుంచి సమాచారాన్ని సేకరించి, ఖచ్చితమైన అంచనాల ఆధారంగా చివరి గ్రామం వరకు పరిస్థితులను పరిశీలించామన్నారు. తుపాను దిశ ఎప్పటికప్పుడు మారుతుంటుందని, దాని ప్రభావం కూడా మారుతుందని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా సహాయక చర్యల్లో మార్పులు చేశామని వివరించారు. అర్నబ్ తుపాను తీరం దాటే సమయంలో సుమారు 25 వేల మంది ఆన్‌లైన్ ద్వారా పరిస్థితులను పర్యవేక్షించారని.. రాత్రి 11.15 గంటలకు అర్నబ్ తుపాను తీరం దాటిందని చెప్పారు. ఆ తర్వాత మురసు తుపాను కూడా దిశ మార్చుకుంటూ కోనసీమ, నరసాపురం ప్రాంతాల మధ్య తీరం దాటే పరిస్థితి ఏర్పడిందన్నారు. తెల్లవారుజామున 10.15 గంటల వరకు తుపాను నిలకడగా ఉన్న పరిస్థితులను కూడా పరిశీలించామని వివరించారు. పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల ప్రజలను, అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశామని తెలిపారు సీఎం..

90 శాతానికి పైగా కచ్చితత్వంతో తుపాను అంచనాలు
గతంలో 1996లో తూర్పుగోదావరి జిల్లాలో సూపర్ సైక్లోన్‌ను చూశానని, హుద్‌హుద్, తిత్లీ, మోంథా వంటి తుపానులను కూడా ఎదుర్కొన్నామని చంద్రబాబు గుర్తుచేశారు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నామని చెప్పారు. RTGS, అవేర్ వ్యవస్థల ద్వారా తుపాను పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. వర్షపాతం నమోదు కోసం వివిధ ప్రాంతాల్లో రెయిన్ గేజ్‌లు ఏర్పాటు చేశామని, రిజర్వాయర్లు, భూగర్భ జలాల పర్యవేక్షణకు సెన్సార్లను వినియోగిస్తున్నామని తెలిపారు. ఉపగ్రహ చిత్రాలు, రాడార్ డేటా ఆధారంగా తుపాను కదలికలను పరిశీలిస్తున్నామని, గాలుల వేగాన్ని కొలిచేందుకు ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. గాలుల వేగం, వర్షపాతం, నీటి ప్రవాహంపై ముందస్తు అంచనాలు వేసి అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. రిజర్వాయర్లలోకి వచ్చే నీటి ప్రవాహాన్ని అంచనా వేయడంతో పాటు చెరువులు, ఇతర నీటి వనరులు తెగిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు చంద్రబాబు. ఈసారి 90 శాతానికి పైగా కచ్చితత్వంతో వాతావరణ అంచనాలు వేయగలిగామని తెలిపారు. వాతావరణ అంచనాలను క్షేత్రస్థాయి పరిస్థితులతో అనుసంధానం చేసి కలెక్టర్లు రియల్ టైమ్ సమాచారంతో నిర్ణయాలు తీసుకునేలా వ్యవస్థను రూపొందించామని చెప్పారు. ఏ జిల్లాలో ఎంత వర్షం కురుస్తుంది? ఎక్కడ తీవ్ర గాలులు వీస్తాయి? ఏ గ్రామాలకు ముంపు ప్రమాదం ఉంది? అనే అంశాలను విశ్లేషించి అవసరమైన పరికరాలు, యంత్రాలు, సిబ్బందిని ముందుగానే సిద్ధం చేశామన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలతో ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించగలిగామని, డేటా కేవలం నివేదికల కోసం కాకుండా నిర్ణయాల కోసం ఉపయోగపడుతుందని నిరూపించామని చంద్రబాబు పేర్కొన్నారు.

31 వేల విద్యుత్ స్తంభాలు నేలకొరిగినా.. 4-5 రోజుల్లోనే పునరుద్ధరణ
తుపాను ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ వేగంగా పునరుద్ధరించామని సీఎం తెలిపారు. మొత్తం 31 వేల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని, 4,095 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. 540 సబ్‌స్టేషన్లు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యుత్ శాఖ కార్యదర్శి నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరూ రంగంలోకి దిగారని, సీఎండీలు, డిస్ట్రిబ్యూషన్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి పనులను పర్యవేక్షించారని చెప్పారు. సాధారణంగా 15 నుంచి 20 రోజులు పట్టే విద్యుత్ పునరుద్ధరణ పనులను కేవలం 4 నుంచి 5 రోజుల్లోనే పూర్తి చేయగలిగామని తెలిపారు. వర్షం పడుతున్నప్పటికీ విద్యుత్ సిబ్బంది పనులు కొనసాగించారని, నేలకొరిగిన చెట్లను తొలగించి వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేపట్టారని వివరించారు. పనుల వేగం పెంచేందుకు డ్రిల్లింగ్ యంత్రాలను వినియోగించామని చెప్పారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల్లో వరి పొలాలు, ఆక్వా చెరువుల మధ్య విద్యుత్ మరమ్మతులు చేపట్టడం పెద్ద సవాలుగా మారిందన్నారు. ప్రాణాలకు తెగించి వర్షంలోనూ విద్యుత్ స్తంభాలు ఎక్కి సిబ్బంది సేవలందించారని ప్రశంసించారు.

5 వేల మంది గర్భిణులకు సురక్షిత వైద్య సేవలు
తుపాను సమయంలో కేవలం ప్రాణాలను కాపాడటమే కాకుండా వైద్యం, రవాణా, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని చంద్రబాబు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తుపాను ప్రభావం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఎప్పటికప్పుడు మాట్లాడామని చెప్పారు. సుమారు 5 వేల మంది గర్భిణులను ముందుగానే ఆసుపత్రులకు తరలించి సురక్షితంగా ఉంచామని, అవసరమైన వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచామని వెల్లడించారు. విపత్తుల సమయంలో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండటంతో పారిశుధ్య నిర్వహణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. మురసు తుపాను కారణంగా సుమారు 3.52 లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లిందని, ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయని వెల్లడించారు. తుపానుల అనుభవాల నుంచి అనేక పాఠాలు నేర్చుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్రానికి ప్రధానంగా రెండు సమస్యలు ఉన్నాయని, రాయలసీమ ప్రాంతంలో కరువు, తీర ప్రాంతాల్లో తుపానుల రూపంలో ప్రకృతి విపత్తులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ముందస్తు అంచనాలు, సత్వర నిర్ణయాలు, అన్ని శాఖల సమన్వయం, విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక ప్రణాళికలతో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నామని వివరించారు.

తుపాను సహాయక చర్యల్లో ప్రజల భాగస్వామ్యం
సహాయక, పునరావాస కార్యక్రమాల్లో ప్రజలు కూడా స్వచ్ఛందంగా సహకరించారని చంద్రబాబు తెలిపారు. రోడ్లపై పడిన చెట్లను తొలగించడంలో ప్రజలు అధికారులకు తోడ్పడ్డారని చెప్పారు. భవిష్యత్తులోనూ విపత్తు సహాయక చర్యల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని నిర్ణయించామన్నారు. ప్రజలు తమ సమస్యలను వాట్సాప్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. మన మిత్ర యాప్ ద్వారా వాట్సాప్ సందేశం, జియో ట్యాగింగ్ సహాయంతో సమస్యల వివరాలను పంపవచ్చని తెలిపారు. ప్రజలు పంపిన ఫిర్యాదులపై అధికారులు స్పందించి, సమస్య పరిష్కారమైన తర్వాత తిరిగి సమాచారం అందిస్తున్నారని వివరించారు. ఫిర్యాదు వచ్చిన దగ్గరి నుంచి పరిష్కారం అయ్యే వరకు ఎండ్ టు ఎండ్ విధానంలో పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. సీనియర్ అధికారులు కూడా క్షేత్రస్థాయిలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అవసరమైన చోట వనరులను వినియోగిస్తూ, అధికారులకు సమాచారం, సామగ్రి అందించడంతో పాటు క్షేత్రస్థాయిలో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇచ్చామని పేర్కొన్నారు.

తప్పుడు ప్రచారాలు, పుకార్లు సృష్టించవద్దు
విపత్తు సమయంలో ప్రభుత్వ చర్యలను ఎగతాళి చేయడం, తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమలో తుపాను హెచ్చరికలు, పాఠశాలల సెలవులపై సోషల్ మీడియాలో కొందరు ఎగతాళి చేశారని ప్రస్తావించారు. వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయని, కేవలం మూడు గంటల్లోనే పరిస్థితులు మారిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రభుత్వ చర్యలను విమర్శించడం సులభమని, కానీ ముందుగానే పరిస్థితులను అంచనా వేసి సమస్యలను పరిష్కరించడం కష్టమైన పని అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ చిత్తశుద్ధిని రాజకీయ కోణంలో కాకుండా అర్థం చేసుకోవాలని కోరారు. తప్పుడు ప్రచారాలు, పుకార్లు సృష్టించవద్దని ప్రజలకు సూచించారు. అదే సమయంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించి, అధికారుల నిర్లక్ష్యం లేదా తప్పిదాలు ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యవహారాలపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామని తెలిపారు.

55 ప్రభుత్వ సేవలపై సాంకేతిక ఆడిట్
ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న 55 సేవలపై సాంకేతిక ఆడిట్ నిర్వహిస్తున్నామని, సేవలు పొందిన తర్వాత ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నామని వెల్లడించారు. అధికారుల పనితీరుపై ఫిర్యాదులు వస్తే వాటిని సరిదిద్దుకోవాలని సూచిస్తున్నామని చెప్పారు. ప్రజా సమావేశాల్లో అధికారుల జవాబుదారీతనాన్ని పెంచామని తెలిపారు. ప్రభుత్వ సేవలను 75 నుంచి 90 శాతం మంది ప్రజలు ఆమోదించే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇంకా మెరుగైన సేవలు అందించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే తమ లక్ష్యమన్నారు. రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా అందరికీ న్యాయం జరగాలని, ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్న ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరించడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. సుపరిపాలన, ప్రజలకు అందించే సేవలే ఎన్నికల్లో ప్రజల తీర్పునకు ప్రధాన అంశాలని అభిప్రాయపడ్డారు. ఎన్నికలు జరుగుతున్నప్పటికీ తాను పూర్తిగా తుపాను సహాయక చర్యలపైనే దృష్టి పెట్టానని చంద్రబాబు తెలిపారు. ప్రజల కష్టాల ముందు ఎన్నికలు ముఖ్యం కాదని, ప్రజల ప్రాణాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడటమే తొలి ప్రాధాన్యతగా భావించానని చెప్పారు. ఎన్నికల ఫలితాల గురించి తర్వాత ఆలోచిస్తానని, ప్రజల కోసం పనిచేస్తే ఎన్నికల్లో వారే స్పందిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు మించి అభివృద్ధి చేసి చూపించామని, ప్రతి ఒక్కరికీ ఇబ్బందులు లేకుండా సమస్యలను పరిష్కరిస్తూ పాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. మంచి రాజకీయాలు, మంచి పాలన అందించడమే తన ప్రయత్నమని తెలిపారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తున్నామని, తుపానును ఎదుర్కోవడం, ప్రాణనష్టం తగ్గించడం, త్వరగా సాధారణ పరిస్థితులు తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత వేగంగా తుపానును ఎదుర్కొని పునరుద్ధరణ చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ప్రతి విపత్తు నుంచి పాఠాలు నేర్చుకుని తదుపరి స్థాయిలో వ్యవస్థను మెరుగుపరుస్తామని చెప్పారు. ఇక, కృష్ణా నుంచి శ్రీకాకుళం వరకు తుపాను ప్రభావం ఎక్కువగా ఉందని చంద్రబాబు తెలిపారు. కృష్ణా, పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో మళ్లీ వర్షాల ప్రభావం కనిపిస్తోందని, ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. బుడమేరు విషయంలో వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. పరిస్థితులపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం అందిస్తుందని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..