CM and Deputy CM Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఇప్పటికే పీడీఎస్ బియ్యంపై ఏపీ సర్కారు సీరియస్‌గా ఉన్న సమయంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ బియ్యం విషయంలో ప్రభుత్వం సీరియస్ అవడంతో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. తాను స్వయంగా పోర్టుకు వెళితే ఎదురైన పరిణామాలపైన… భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపైనా.. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా, పూర్తి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి ఏం చేయాలి అనే అంశంపైనా సీఎం, డిప్యూటీ సీఎంలు చర్చించినట్లు సమాచారం.
Read Also: Health Benefits: చలికాలంలో పసుపును ఇలా వాడితే.. ఆ సమస్యలు దరిచేరవు..!
ఇక రాజ్యసభ బై ఎలక్షన్ల నేపథ్యంలో అభ్యర్ధుల అంశంపై కూడా ఇద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. టీడీపీ తరఫున బీదా మస్తాన్ రావు ఉండగా, జనసేన తరఫున ఎవరు అనే దానిపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఇదే అంశంపై ఢిల్లీ పెద్దలతో మాట్లాడి.. తన అన్న నాగబాబుకు రూటు క్లియర్ చేశారని చర్చ జరుగుతోంది. అలాగే బీజేపీ ఆర్. కృష్ణయ్యకు చోటిస్తుందా.. లేక మరెవరినైనా ప్రతిపాదిస్తుందా అనే అంశం పైన కూడా.. చంద్రబాబు, పవన్ చర్చించినట్టు తెలుస్తోంది. అటు నామినేటెడ్ పదవుల అంశం పైన కూడా చర్చించినట్టు సమాచారం. సోషల్ మీడియా కేసులపైన కూడా ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే కేబినెట్‌లో పీడీఎస్ రైస్ అంశంపైన కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని ఇద్దరు నేతలు చర్చించినట్టు సమాచారం.
Read Also: CRDA: సీఎం అధ్యక్షతన సీఆర్‌డీఏ సమావేశం.. అమరావతి నిర్మాణంలో ముందడుగు..!
మరోవైపు మంత్రివర్గ సమావేశాన్ని ఒక రోజు ముందే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 4న ఈ భేటీ జరగాల్సి ఉంది. తాజాగా మంగళవారమే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు పీడీఎస్ రైస్‌కు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేయడంపైన వైసీపీ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని సెటైర్లు వేశారు. ప్రాణాలకు తెగించి పవన్ చేసిన ఈ ప్రయత్నం పై కొన్ని అనుమానాలు ఉన్నాయన్నారు పేర్ని నాని. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు. కాకినాడ పోర్ట్‌లో పవన్ కళ్యాణ్ యాక్షన్.. గబ్బర్ సింగ్ 3 తలపించిందన్నారు. పీడీఎస్ రైస్ పక్కదారి పట్టడం.. ఎవరు చేసిన తప్పేనన్నారు. అధికారంలో మీరు ఉన్నారుగా ఎందుకు చర్యలు ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. మొత్తంగా పీడీఎస్ రైస్ అంశం..ఏపీలో కాక రేపుతోంది. దీనిపై సీరియస్‌గా ఉన్న ఏపీ సర్కారు.. రేపు కేబినెట్ భేటీలో ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.