TDP Leadership Training Conclave: చంద్రబాబుకు అభినందన తీర్మానం.. స్టాండింగ్ ఓవేషన్

Chandrababu Honoured

Chandrababu Honoured

TDP Leadership Training Conclave: తెలుగుదేశం పార్టీ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అభినందనలు తెలిపారు. ‘సీఈవో సీఎం టూ వాటర్‌మ్యాన్’ పేరుతో ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని ప్రస్తావిస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు అభినందన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు సభలో స్టాండింగ్ ఓవేషన్‌తో నేతలు అభినందనలు తెలిపారు. ఐటీ విప్లవం ద్వారా తెలుగు వారికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకురావడంతో పాటు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నీటి నిర్వహణలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని తీర్మానంలో పేర్కొన్నారు. ‘జలం ఉంటేనే జనం.. అభివృద్ధి’ అనే నినాదంతో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.

పోలవరం, వెలిగొండ వంటి ప్రాజెక్టులపై ఎకనామిక్ టైమ్స్ ప్రశంసలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. పట్టిసీమ, హంద్రీనీవా ప్రాజెక్టుల ద్వారా నీటిని తరలించిన విధానాన్ని కూడా గుర్తుచేశారు. మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న వెలిగొండ కలను చంద్రబాబు సాకారం చేశారని పేర్కొన్నారు. ఏడాదిన్నరలో పోలవరం ఎడమ కాలువను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. గోదావరి జలాలను అనకాపల్లి వరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. 2027 పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. రూ.35 వేల కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భూగర్భ జలాల పెంపునకు ‘జలధార’ ప్రణాళికను అమలు చేయనున్నట్లు తెలిపారు. సాగునీరు, నీటి వనరుల అభివృద్ధికి చంద్రబాబు తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అభినందనలు తెలిపారు.