NTV Telugu Site icon

AP Capital Region: రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు.. ఎవరికి ఎంతంటే..?

Narayana

Narayana

AP Capital Region: సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.. రాజధానిలో సంస్థలకు భూకేటాయింపులపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించి ఓ నిర్ణయానికి వచ్చింది.. అమరావతిలో కార్యాలయాలు ఏర్పాటుకు గతంలో పలు సంస్థలకు ప్రభుత్వం భూకేటాయింపులు చేసిన విషయం విదితమే కాగా.. ఆయా సంస్థల ఏర్పాటు, కొత్తగా భూ కేటాయింపులకు వచ్చిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించారు.. ఈ కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, టీజీ భరత్, సంధ్యా రాణి, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగూరు నారాయణ.. ఏ సంస్థకు ఎంత మేర భూమి కేటాయించారో వివరించారు.

Read Also: Pushpa 2 : పుష్ప ఎన్ని వేల థియేటర్స్ లో రిలీజ్ అవుతుందంటే..!

భూకేటాయింపులపై గ్రూప్‌ ఆఫ్ మినిస్టర్స్‌ సమావేశంలో చర్చ జరిగిందన్నారు మంత్రి నారాయణ.. GoM కొన్ని సంస్థలకు భూములు కేటాయించేందుకు అనుమతి ఇచ్చిందని వివరించిన ఆయన.. ఈఎస్ఐ ఆసుపత్రి మెడికల్ కాలేజీకి 20 ఎకరాలు.. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్ కు 5 ఎకరాలు.. IGNOUకి 0.8 ఎకరాలు.. బసవతారకం ఆస్పత్రికి 15 ఎకరాలు, l&tకి 5 ఎకరాలు.. బ్రహ్మకుమారీస్‌కి 10 ఎకరాలు కేటాయించామని తెలిపారు.. ఇక, సీఆర్డీఏ అధికారులతో కూడా చర్చించాం.. ఈ భూకేటాయింపులు డిసెంబరు నెలాఖరులోగా పూర్తవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు.. ప్రాజెక్టులు కంటిన్యూ చేయడానికి సీఈలతో ఒక కమిటీ వేశామని.. ఈ డిసెంబర్‌ నెలాఖరుకల్లా 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, మిగతా టవర్ల నిర్మాణాలకు టెండర్లు పూర్తవుతాయని పేర్కొన్నారు.. ఇక, వచ్చే జనవరి నుంచి పనులు మొదలవుతాయని తెలిపారు.. 131 మందికి గతంలో భూములు ఇచ్చాం.. వాటితో పాటు కొత్త వారికి కూడా భూములు ఇస్తున్నాం.. గతంలో ఇచ్చిన వారికి అప్పటి ధరలకే భూములు ఇస్తున్నాం. ధరల అంశంలో ఒక పాలసీ తయారు చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి పొంగూరు నారాయణ.