Rajya Sabha: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ మూడు ఎన్డీఏ కూటమిలో పడటం లాంఛనమే. అయితే రాజ్యసభలో అడుగు పెట్టేది ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మూడు పార్టీల నుంచి భారీగా ఆశావహులు ఉన్నారు. ఎవరికి వారు లాబీయింగ్ మొదలుపెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన అన్నయ్య నాగబాబును రాజ్యసభకు పంపే పనిలోపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. నాగబాబు.. జనసేన ఆవిర్భావం నుంచి తమ్ముడు కల్యాణ్‌కు తోడుగా ఉంటున్నారు. అయితే, లింగమనేని రమేష్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ నాగబాబు ఒకే అయితే.. సామాజిక సమీకరణాల్లో భాగంగా టీడీపీ నుంచి రేసులో ఉన్న సానా సతీష్, వంగవీటి రాధకు భంగపాటు తప్పదు. పీఏసీ, కార్పోరేషన్ చైర్మన్ కూడా కాపులకే ఇచ్చారు. ఈ కోణంలో అన్నీ ఒకే సామాజిక వర్గానికి ఇస్తే ఇబ్బంది అనుకుంటే.. లింగమనేని రమేష్‌కు ఇచ్చే ఛాన్స్ ఉంది.
Read Also: Pakistan: షియా-సున్నీల మధ్య ఘర్షణ.. 100 మంది మృతి
మిగిలిన రెండు స్థానాల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఇందులో మాజీ ఎంపీ బీద మస్తాన్‌రావును టీడీపీ తరపున మళ్లీ పెద్దలకు సభకు పంపుతారనే ప్రచారం జరుగుతోంది. రెండేళ్లకుపైగా పదవీకాలం ఉండగానే బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతానికి టీడీపీ ఇచ్చిన హామీ మేరకు మస్తాన్‌రావును రాజ్యసభకు రెండో అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. టీడీపీ నుంచి మరికొందరు ఆశావహులు లైన్‌లో ఉన్నారు. కిలారు రాజేష్, సానా సతీష్, టీడీ జనార్దన్, దేవినేని ఉమా, వంగవీటి రాధ, భాష్యం రామకృష్ణ, గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహన్, కనకమేడల, అశోక్ గజపతిరాజు వంటి నేతలు పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా..? లేదంటే కొత్త అభ్యర్థిని రాజ్యసభకు పంపుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
Read Also: Delhi: అమిత్ షాతో భేటీకానున్న మహాయుతి అగ్ర నేతలు.. మహారాష్ట్ర సీఎంపై వీడనున్న ఉత్కంఠ
మరోవైపు కేంద్ర మాజీ మంత్రి సురేశ్ ప్రభు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారని సమాచారం. నెల రోజుల ముందే ఇద్దరూ భేటీ అయినట్టు సమాచారం. తనను ఏపీ తరపున నామినేట్ చేయాలని కోరినట్లు తెలుస్తోంది. కేంద్ర సహకారం తప్పని పరిస్ధితుల్లో కచ్చితంగా బీజేపీ ఒక రాజ్యసభ సీటు దక్కుతుందని అంటున్నారు. అయితే ఏపీలో కమలం పార్టీ తరపున రాజ్యసభకు అభ్యర్ధులే లేరా అనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. ఏదేమైనా పెద్దలకు సభకు వెళ్లే ఆ ముగ్గురు ఎవరన్నది కొద్ది రోజుల్లో తేలుతుంది. రాజ్యసభ ఉప ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల స్వీకరణకు డిసెంబర్ 10 లాస్ట్ డేట్. డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 20న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తారు.