Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌ను ఇప్పటికే వరుస తుఫాన్లు అతలాకుతలం చేశాయి.. ఇప్పుడు మరో తుఫాన్ ముప్పు తప్పదా? అంటే అవుననే పరిస్థితులు కనిపిస్తున్నాయి.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఆగ్నేయ బంగాళాఖాతంతో పాటు దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమై ఉంది. గత ఆరు గంటల్లో గంటకు సుమారు 8 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం అండమాన్ దీవులకు 640 కిలోమీటర్లు, చెన్నైకి 760 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 870 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 980 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా కదులుతూ సోమవారం సాయంత్రానికి తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశముందని తెలిపారు.
ఆ తర్వాత 48 గంటల్లో కోస్తాంధ్ర తీర ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక సోమవారం సాయంత్రం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ సూచించారు.

