AP Weather Alert: 9 జిల్లాల్లో భారీ వర్షాలు.. మరో 3 గంటలు జాగ్రత్త.. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి: APSDMA

Heavy Rains Ap

Heavy Rains Ap

AP Weather Alert: అర్నబ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌తో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొట్టాయి.. కొన్ని జిల్లాల్లో బీభత్సాన్నే సృష్టించాయి.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కలిగించాయి.. మరోవైపు రాష్ట్రంలో రాగల మూడు గంటల్లో తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం, ఏలూరు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు.

ఇక, ఏలూరు, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

కాగా, అర్నబ్‌ తుఫాన్‌ పై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇప్పటి వరకు కలిగిన పంట నష్టంతో పాటు.. ఇతర నష్టాలను కూడా అంచనా వేయాలని సూచించిన ఆయన.. సహాయక చర్యలు వేగంగా చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.. మరోవైపు.. వర్షాలు ఆగే వరకు.. సహాయక చర్యలు పూర్తి అయ్యే వరకు క్షేత్రస్థాయిలోనే ఉండాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. అధికారులను ఆదేశించారు..