Speaker Ayyanna Patrudu: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు ‘నో వర్క్.. నో పే’ విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన స్పీకర్ల మహాసభలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల పట్ల శాసన వ్యవస్థకు ఉన్న జవాబుదారీతనం అంశంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక ప్రసంగం చేశారు.
Read Also: Mankatha: అజిత్ ‘గ్యాంబ్లర్’ రీ-రిలీజ్ బుకింగ్స్ ఊచకోత!
ఎమ్మెల్యేలు ప్రజల ప్రతినిధులని, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం వారి ప్రాథమిక బాధ్యత అని స్పీకర్ పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకుని పంపిన ప్రతినిధులు సభకు రాకుండా జీతాలు పొందడం సరికాదన్నారు. శాసనసభ కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారానే ప్రజల సమస్యలు చర్చకు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశంపై లోక్‌సభ స్పీకర్ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు ఈ విషయాన్ని గంభీరంగా పరిగణనలోకి తీసుకోవాలని అయ్యన్నపాత్రుడు కోరారు. శాసనసభ వ్యవస్థను మరింత బాధ్యతాయుతంగా మార్చేందుకు ఇలాంటి సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేల హాజరు తప్పనిసరిగా ఉండేలా ‘నో వర్క్.. నో పే’ విధానం అమలైతే, శాసనసభ పనితీరు మెరుగుపడుతుందని, ప్రజల విశ్వాసం మరింత బలపడుతుందని స్పీకర్ పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. స్పీకర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లో కూడా విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. కాగా, స్పీకర్ అయ్యన్నపాత్రుడు గతంలోనూ ఈ తరహా కామెంట్లు చేసిన విషయం విదితమే..
