AP MPTC, ZPTC Elections: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని, ఎన్నికల నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని రైల్వే వాగన్ వర్క్‌షాప్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంతో పాటు విజయవాడ రూరల్ మండలం పాతపాడులోని పోలింగ్ కేంద్రం, గన్నవరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, పోలింగ్ నిర్వహణ తీరు, భద్రతా ఏర్పాట్లపై ఎన్నికల సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అలాగే పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లతో నేరుగా మాట్లాడి ఓటు వేసే సమయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా, అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్.. అన్ని ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని, ఎలాంటి ఇబ్బందులు లేవని ఓటర్లు, పోలింగ్ సిబ్బంది తెలిపినట్లు కమిషనర్ వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అనిల్ చంద్ర పునేఠ తెలిపారు. జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సమర్థవంతంగా చేపట్టిందని, అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.
సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుందని ఆశిస్తున్నామని, అనంతరం బ్యాలెట్ బాక్సులను పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తామని తెలిపారు. రిసెప్షన్ కేంద్రాల్లో అవసరమైన అన్ని లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను భద్రపరుస్తామని వివరించారు. తాను సందర్శించిన అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ నిఘా ఏర్పాటు చేసినట్లు, స్ట్రాంగ్ రూమ్‌లలో కూడా నిరంతరం సీసీటీవీ పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వెల్లడించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎన్నికల అబ్జర్వర్ వి. అభిషేక్‌తో కూడా ఎన్నికల పోలింగ్ సరళిపై చర్చించారు. పోలింగ్ ముగియడానికి ఇంకా సమయం ఉన్నందున ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ విజ్ఞప్తి చేశారు.

