Site icon NTV Telugu

Minister Narayana meets CM Yogi: యూపీ సీఎం యోగితో మంత్రి నారాయణ భేటీ..

Narayana

Narayana

Minister Narayana meets CM Yogi: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో సమావేశం అయ్యారు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. లక్నోలోని కాళిదాస్ మార్గ్ లో ఉన్న యూపీ సీఎం నివాసంలో ఈ సమావేశం జరిగింది.. ఘన వ్యర్థాల ప్లాంట్ల అధ్యయనం కోసం లక్నో పర్యటనకు వెళ్లింది మంత్రి నారాయణ బృందం.. క్షేత్రస్థాయి పర్యటన తర్వాత యూపీ సీఎం, అధికారులతో మంత్రి నారాయణ, ఏపీ అధికారుల భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ లో ఘన వ్యర్థాల నిర్వహణను వివరించారు ఆ రాష్ట్ర అధికారులు.. మరోవైపు, ఏపీలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కొరకు ఉపయోగిస్తున్న పద్ధతులను సీఎం యోగి ఆదిత్యనాథ్ కు వివరించారు మంత్రి నారాయణ, అధికారులు.. ఏపీలో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించేందుకు రావాలని యూపీ అధికారులను ఆహ్వానించారు మంత్రి నారాయణ.. ఇక, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి విజన్ ఉన్న నాయకుడని ఈ సందర్భంగా కొనియాడారు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్..

Read Also: Amithabachan : నా మరణం గురించి మాట్లాడినందుకు థాంక్స్.. అమితాబ్ షాకింగ్ కామెంట్..

ఇక, సోషల్‌ మీడియాలో తన యూపీ పర్యటనపై స్పందించిన మంత్రి నారాయణ.. నేడు ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో వేస్ట్ టు ఎనర్జీ మోడల్స్ ను అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. లక్నో మేయర్, కమిషనర్ గౌరవ్ కుమార్ మమ్మల్ని ఘనంగా స్వాగతించారు. అధికారులు ఘన వ్యర్థాల నిర్వహణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం లక్నోలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌తో పాటు ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను పరిశీలించాం. ఆంధ్రప్రదేశ్‌ను డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. ఇప్పటికే రెండు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు అయ్యుండగా, త్వరలో మరికొన్ని ప్లాంట్లు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇతర రాష్ట్రాల్లోని అభ్యాస యోగ్యమైన వ్యర్థ నిర్వహణ విధానాలను అధ్యయనం చేస్తూ ఉత్తమ మోడల్స్‌ను ఎంచుకోవడమే ఈ పర్యటన లక్ష్యం. ఈ పర్యటనలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు, మంగళగిరి-తాడేపల్లి కమిషనర్ అలీమ్ భాష పాల్గొన్నారని ఎక్స్‌ ద్వారా వెల్లడించారు మంత్రి పొంగూరు నారాయణ..

Exit mobile version