AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. స్వల్ప ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా 18 జిల్లాల్లో మొత్తం 44 ఘటనలు నమోదైనట్లు తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టిందని పేర్కొన్నారు.
46,380 మంది పోలీసులతో భారీ బందోబస్తు
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల భద్రత కోసం మొత్తం 46,380 మంది పోలీస్ సిబ్బందిని మోహరించినట్లు డీజీపీ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టామని, అవసరమైన చోట అదనపు బలగాలను మోహరించి నిరంతర నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించినట్లు వివరించారు.
18 జిల్లాల్లో 44 ఘటనలు నమోదు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని 18 జిల్లాల్లో మొత్తం 44 ఘటనలు నమోదయ్యాయి. ముఖ్యంగా పల్నాడు, సత్యసాయి, నంద్యాల, కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్ని ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలకు సంబంధించి చట్టపరమైన కేసులు నమోదు చేసినట్లు డీజీపీ తెలిపారు. ఘటనల్లో పాల్గొన్న నిందితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అక్రమాలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని డీజీపీ హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు డీజీపీ వెల్లడించారు. బ్యాలెట్ బాక్సుల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పోలీసుల నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు.
విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం
ఎన్నికల అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం విధించినట్లు డీజీపీ స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల అనంతరం కూడా ప్రజలు శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని సూచించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ..

