AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం.. హైకోర్టుకు నివేదిక..

Ap High Court

Ap High Court

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో గురువారం కీలక విచారణ జరిగింది. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన నివేదికను ఏకసభ్య కమిషన్ హైకోర్టుకు సమర్పించింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు పలు కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని, అవసరమైన ప్రక్రియలు పూర్తైన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

బీసీ రిజర్వేషన్ల నిర్ణయానికి కీలకమైన సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందని ఏజీ కోర్టుకు వివరించారు. ఈ సర్వేకు సంబంధించిన డేటాను జూన్ 19 నుంచి రెండు రోజులపాటు గ్రామసభల ముందు ఉంచనున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, సూచనలను జూన్ 24 వరకు స్వీకరిస్తామని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ త్వరలోనే తన తుది నివేదికను సమర్పించనుందని ఏజీ పేర్కొన్నారు. ఆ నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని కోర్టుకు తెలియజేశారు.

×
×
Ad

రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరాలను నమోదు చేసిన హైకోర్టు, తదుపరి విచారణను జూలై 16కు వాయిదా వేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై త్వరలో మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. బీసీ రిజర్వేషన్ల ఖరారు, సమగ్ర కుటుంబ సర్వే అభ్యంతరాల పరిశీలన పూర్తయిన తర్వాత ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.