AP Junior Doctors Strike: స్టైఫండ్ పెంపు డిమాండ్‌తో సమ్మె చేస్తున్న ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్లతో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. స్టైఫండ్ పెంపు విషయంలో ప్రభుత్వం, జూనియర్ డాక్టర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో చర్చలు అసంపూర్తిగా ముగియగా.. జూనియర్ డాక్టర్లు మాత్రం సమ్మె కొనసాగిస్తున్నారు.. అంతేకాదు.. తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు జూడాలు..
స్టైఫండ్‌ను 30 శాతం పెంచాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న జూనియర్ డాక్టర్లు.. కనీసం 20 శాతం అయినా పెంచాలని చర్చల సందర్భంగా కోరినట్లు తెలిపారు. అయితే 20 శాతం పెంపు కూడా సాధ్యం కాదని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేసినట్లు సమాచారం. జూనియర్ డాక్టర్లకు ఏటా 3 శాతం, హౌస్ సర్జన్లకు 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్ ఇచ్చే అంశాన్ని మంత్రి సత్యకుమార్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆర్థిక శాఖ అధికారులతో చర్చించిన తర్వాత మరోసారి జూనియర్ డాక్టర్లతో సమావేశమవుతామని మంత్రి సత్యకుమార్ చెప్పినట్లు సమాచారం. దీంతో సమస్య పరిష్కారానికి ప్రభుత్వం మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉంది.
సమ్మె కొనసాగిస్తామన్న జూడాలు
అయితే ప్రభుత్వం నుంచి తమ ప్రధాన డిమాండ్‌పై స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు తేల్చిచెప్పారు. దీంతో జూడాలు యథావిధిగా విధులకు దూరంగా ఉండి సమ్మె కొనసాగిస్తున్నారు. స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని జూడాల ప్రతినిధులు స్పష్టం చేశారు. మరోవైపు.. ఇదిలా ఉండగా రాష్ట్ర జూడాల సంఘం సమావేశం రేపు ఉదయం సిద్ధార్థ మెడికల్ కాలేజీలో జరగనుంది. ఈ సమావేశంలో ప్రస్తుత పరిస్థితిపై చర్చించి, సమ్మెను మరింత ఉధృతం చేసే దిశగా భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం APJUDA రాష్ట్ర ప్యానెల్ మీడియాతో మాట్లాడి.. చర్చల్లో జరిగిన అంశాలు, తమ తదుపరి కార్యాచరణపై పూర్తి వివరాలను వెల్లడించనుంది.

