AP High Court: పండుగలు, సెలవుల్లో బస్సు టికెట్ ధరల పెంపుపై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు

Ap High Court

Ap High Court

AP High Court: పండుగలు, సెలవులు వచ్చాయంటే.. సొంత ఊరు వెళ్లడానికో.. నచ్చిన ప్రదేశాలను చూసేందుకు ప్రయాణాలు పెరుగుతుంటాయి.. అయితే, ఇదే అదునుగా భావించి.. ప్రయాణికుల ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నాయి ప్రైవేట్‌ ట్రావెల్స్‌.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో పండుగలు, సెలవు రోజుల్లో ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ఇష్టానుసారంగా టికెట్ ధరలు పెంచడాన్ని నియంత్రించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై (పిల్) ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రైవేట్ బస్సుల ప్రయాణ ఛార్జీల నియంత్రణకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది.

ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు వసూలు చేసే గరిష్ట ప్రయాణ ఛార్జీలను నిర్ణయించేందుకు నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిని సమర్థంగా అమలు చేయడం లేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా సంక్రాంతి, దసరా వంటి పండుగలతో పాటు ఇతర సెలవు రోజుల్లో ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు అధిక ధరలు వసూలు చేస్తున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల అనుమతులు, బస్సులకు సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర సమాచారాన్ని ఆన్‌లైన్ యాప్‌లలో ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. తద్వారా ప్రయాణికులకు బస్సుల వివరాలు, వాటి అనుమతులపై పారదర్శకత ఉంటుందని పేర్కొన్నారు.

ఈ పిల్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. పండుగలు, సెలవుల వంటి రద్దీ సమయాల్లో ప్రైవేట్ బస్సుల ప్రయాణ ఛార్జీలను నిర్ణయించే అంశంపై ఎనిమిది వారాల్లోగా తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖను ఆదేశించింది. ఈ వ్యవహారంపై ఎనిమిది వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో పండుగలు, సెలవు రోజుల్లో ప్రైవేట్ బస్సుల అధిక ఛార్జీల వసూళ్లకు అడ్డుకట్ట పడుతుందా అనే ఆసక్తి నెలకొంది. మరి, హైకోర్టు ఆదేశాలపై ఏపీ రవాణాశాఖ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి..