AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవారికి గుడ్ న్యూస్.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు

Ap High Court

Ap High Court

AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు ఏపీ హైకోర్టు కీలక ఊరటనిచ్చింది. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేయాలనుకునే అభ్యర్థులకు పోలీసు భద్రత కల్పించాలని ఆదేశించింది. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తగిన రక్షణ కల్పించాలని స్పష్టం చేసింది. సర్పంచ్, వార్డు సభ్యులుగా నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమైన పలువురు అభ్యర్థులు తమకు భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు వేసేందుకు పోలీసు భద్రత కోరినప్పటికీ అధికారులు స్పందించడం లేదని పిటిషనర్లు తమ పిటిషన్లలో ఆరోపించారు.

ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులు పోలీసు భద్రత కోరుతూ ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా సమర్పించిన వినతులను పరిగణనలోకి తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు పిటిషనర్లకు తగిన పోలీసు భద్రత కల్పించాలని స్పష్టం చేసింది. దీంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో భద్రత కల్పించే విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చినట్లయింది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే జరిగిన మున్సిపల్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయనీయకుండా అడ్డుకున్న ఘటనలు వెలుగు చూడగా.. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులకు ఊరట దక్కినట్టు అయ్యింది..