YS Jagan: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఊరట లభించింది. గుంటూరు జిల్లా జగన్ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందటంతో నమోదైన కేసులో జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన న్యాయస్థానం ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇక, తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ లు మీద ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. జగన్ ఈ కేసులో ఏ2గా ఉన్నారు. జగన్ తో పాటు కారులో ప్రయాణించిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి జగన్ పీఏ, మాజీ మంత్రి పేర్ని నాని, విడదల రజినిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఐదుగురు కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషనర్లపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని వచ్చే మంగళవారానికి తదుపరి విచారణ వాయిదా వేసింది.
Read Also: Viral Video: ఇది కాకి కాదు మేధావి.. ఈ వీడియో చూశాక దీని తెలివితేటలకు సలాం కొట్టాల్సిందే..!
ఇక, పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కారు ప్రమాదం జరిగితే కారు డ్రైవర్ కాకుండా ప్రయాణికులకు ఏం సంబంధం అని హైకోర్టు ప్రశ్నించింది. పర్మిషన్ సందర్భంగా కొన్ని కండిషన్స్ పాటించాలని చెప్పినా.. జగన్ పాటించలేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. చాలా జాగ్రత్తలు తీసుకున్నా కుంభ మేళాలో ప్రమాదం జరిగింది కదా? అని న్యాయస్థానం పేర్కొంది. ప్రమాదానికి ప్రయాణికులు ఎలా బాధ్యత వహిస్తారనీ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సింగయ్య మృతి కేసులో జగన్ పర్యటనకు ఇచ్చిన పర్మిషన్ నిబంధనలకు ఉల్లంఘించినట్టు కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. విచారణలో పోలీసులు సేకరించిన ఆధారాలు కోర్టుకు అందజేయానికి సమయం కావాలని ప్రభుత్వం కోరింది. సింగయ్య ప్రమాదానికి గురైన సమయంలో అంబులెన్స్ కి, పోలీసులకు సమాచారం ఇవ్వలేదని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది.
Read Also: Kolkata: గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు.. విద్యార్థిని 7 గంటలకు కాలేజీకి ఎందుకు వచ్చింది..?
ఘటన జరిగినపుడు ఒక కారుగా చెప్పిన పోలీసులు తర్వాత ఎస్పీ వచ్చిన తర్వాత జగన్ ప్రయాణిస్తున్న కారు అని చెప్పి సెక్షన్లు మార్చినట్టు కోర్టుకు జగన్ న్యాయవాదులు తెలిపారు. కేవలం రాజకీయ కక్ష సాధింపుతో ఈ కేసు నమోదు చేశారనీ జగన్ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. జగన్ కు సరైన బందోబస్తు ఇవ్వటం లేదని ఈ అంశంపై దాఖలైన 2 పిటిషన్లు హైకోర్టులో విచారణ దశలో ఉన్నాయని జగన్ న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. జగన్ పర్యటనలో 3 కార్లు, 100 మందికి అనుమతి ఇస్తే వందల కార్లు, వేలమందితో పర్యటన జరిపారని ప్రభుత్వం కోర్టు దృష్టికి తెచ్చింది. జగన్ పర్యటనలో ముగ్గురు చనిపోయారని కానీ సింగయ్య మృతిపై మాత్రమే తాము కేసు నమోదు చేశామని కక్ష సాధింపు అయితే ముగ్గురు మృతికి సంబంధించి కేసు నమోదు చేసే వాళ్ళమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది..
