AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు.. సత్యప్రసాద్‌కు ముందస్తు బెయిల్.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు రద్దు..

Ap Liquor Scam

Ap Liquor Scam

AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎక్సైజ్ శాఖ మాజీ అసిస్టెంట్ కమిషనర్ సత్యప్రసాద్‌కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కల్పించాలని కోరుతూ సత్యప్రసాద్ తొలుత ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అయితే, ఆ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. అప్రూవర్‌గా మారే నిందితులు కేసు విచారణ పూర్తయ్యే వరకు జైలులోనే ఉండాల్సి ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది.

ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సత్యప్రసాద్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు గతంలోనే పూర్తయ్యాయి. అనంతరం తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. తాజాగా ఈ కేసులో తీర్పు వెలువరించిన హైకోర్టు, సత్యప్రసాద్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏసీబీ కోర్టు తిరస్కరించిన ముందస్తు బెయిల్ పిటిషన్‌కు హైకోర్టులో ఉపశమనం లభించినట్లైంది. హైకోర్టు ఉత్తర్వులతో లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు, తదుపరి న్యాయపరమైన పరిణామాలపై ఆసక్తి నెలకొంది.