AP Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రానున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత కలెక్టర్లు, ఎస్పీలు, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, ఇతర ఉన్నతాధికారులతో అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుత వాతావరణ వ్యవస్థ దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాల వైపు కదులుతున్నట్లు అధికారుల తాజా అంచనాలు పేర్కొంటున్నాయి.
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిత ఆదేశించారు. ప్రభావిత జిల్లాల అధికారులకు ముందస్తు చర్యలపై సూచనలు జారీ చేశారు. ఒడిశాలో కురిసే భారీ వర్షాల ప్రభావంతో వంశధార, నాగావళి నదులు పొంగే అవకాశం ఉన్నందున సరిహద్దు ఒడిశా జిల్లాల అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇక, సహాయక చర్యల కోసం SDRF, NDRF బృందాలను సిద్ధంగా ఉంచాలని మంత్రి ఆదేశించారు. అవసరమైతే తీర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
వాగులు, పొంగిపొర్లే కాజ్‌వేలు, ముంపు ప్రాంతాల వద్ద తప్పనిసరిగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే అన్ని కంట్రోల్ రూమ్‌లను 24 గంటలూ అందుబాటులో ఉంచి, వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిత సూచించారు. చెట్లు, భారీ హోర్డింగులు, శిథిలావస్థలో ఉన్న ఇళ్ల సమీపంలో ఉండకూడదని హెచ్చరించారు. ప్రభుత్వ వాతావరణ హెచ్చరికలను ప్రజలు తప్పనిసరిగా పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు. తాజా వాతావరణ అంచనాల ప్రకారం సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

