Andhra Pradesh Rice Prices: ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం నిల్వలు, ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. బియ్యం ధరలు అధికంగా పెంచి విక్రయించకుండా, అక్రమ నిల్వలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజాపంపిణీ శాఖ జారీ చేసిన అనుమతి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు వెలువరించింది. బియ్యం రకాలను బట్టి కిలో ధరలను రూ.47 నుంచి రూ.82 వరకు నిర్ణయించింది. వివిధ రకాల బియ్యాన్ని విక్రయించే వ్యాపారులు నిర్ణయించిన ధరల పరిమితులను పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. బియ్యం రకాలను బట్టి కిలోకు కనిష్ఠంగా రూ.47 నుంచి గరిష్ఠంగా రూ.82 వరకు ధరలు నిర్ణయించింది. ఈ ధరలకు మించి విక్రయాలు జరిపితే సంబంధిత వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
మిల్లర్లు, డీలర్లకు కొత్త నిబంధనలు
బియ్యం నిల్వలను నియంత్రించేందుకు మిల్లర్లు, డీలర్లకు ప్రభుత్వం పరిమితులు విధించింది. ప్రతి సంస్థ తమ వద్ద అందుబాటులో ఉన్న బియ్యం నిల్వల వివరాలను కేంద్ర ప్రభుత్వ ఫుడ్ స్టాక్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా ప్రతి శుక్రవారం నిల్వల వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని స్పష్టం చేసింది. నిల్వలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా ఈ చర్యలు చేపట్టింది. బియ్యం నిల్వలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడం, తప్పుడు వివరాలు నమోదు చేయడం, రికార్డుల్లో అవకతవకలకు పాల్పడటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించనుంది. ఇలాంటి చర్యలకు పాల్పడే మిల్లర్లు, డీలర్లు, ఇతర వ్యాపార సంస్థలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనుంది. నిల్వల వివరాల్లో పారదర్శకత పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది.
తనిఖీలకు అధికారులకు ప్రత్యేక మార్గదర్శకాలు
బియ్యం నిల్వలపై పర్యవేక్షణ పెంచేందుకు అధికారులకు ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. బియ్యం నిల్వలు ఎక్కడ ఉన్నా తనిఖీ చేసే అధికారం అధికారులకు కల్పించింది. గోదాములు, ఇతర నిల్వ కేంద్రాలతో పాటు వాహనాలు, నౌకల్లో ఉన్న బియ్యం నిల్వలను కూడా తనిఖీ చేయవచ్చు. నిల్వల పరిమితులను ఉల్లంఘిస్తున్నారా? నిర్ణయించిన ధరల కంటే అధికంగా విక్రయిస్తున్నారా? అనే అంశాలను అధికారులు పరిశీలించనున్నారు. రాష్ట్రంలో బియ్యం ధరలు నియంత్రణలో ఉండేలా చూడటంతో పాటు అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలను అరికట్టడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మిల్లర్లు, డీలర్లు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.

