Salary Hike: ఆ ఉద్యోగులకు శుభవార్త.. 10 శాతంపైగా జీతాలు పెంచిన ప్రభుత్వం

Ap Govt

Ap Govt

Salary Hike: అమరావతి కేంద్రంగా పనిచేస్తున్న లేపాక్షి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల జీతాలను పెంచుతూ మంత్రి సవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. లేపాక్షి షోరూమ్‌లలో అమ్మకాలు గణనీయంగా పెరగడంతో ఉద్యోగులకు ప్రత్యేక బోనాంజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం అందిస్తున్న మూల వేతనంపై 10 శాతం కంటే ఎక్కువ పెంపు వర్తింపజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో లేపాక్షి షోరూమ్‌ల అమ్మకాలు రూ.60.75 కోట్లకు పెరగడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా పేర్కొన్నారు.

అమ్మకాలు పెంచడంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులను మంత్రి సవిత అభినందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లేపాక్షి షోరూమ్‌ల అమ్మకాలను రూ.80 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. హస్తకళాకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కళాకారులకు మార్కెట్ అవకాశాలు పెంచడంతో పాటు ఉద్యోగుల సంక్షేమంపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు మంత్రి సవిత.. ఇక, జీతాలు పెంచినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన కల్యాణ్‌ మరియు మంత్రి సవితకు లేపాక్షి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.