NTV Telugu Site icon

Amaravati Capital: రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు సర్కార్‌ కీలక నిర్ణయం..

Amaravati

Amaravati

Amaravati Capital: అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలపై మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన నిర్మాణాల స్థితిగతులపై సాంకేతిక నిపుణులతో కమిటీని నియమించింది.. వివిధ శాఖలకు చెందిన ఇంజనీర్లతో సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసింది.. ప్రజారోగ్యశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ చైర్మన్ గా సాంకేతిక కమిటీని నియమించింది.. కమిటీలో సభ్యులుగా రహదారులు భవనాలు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ సీపీడీసీఎల్, ఏపీ సీఆర్డీఏ, ఏడీసీ సంస్థలకు చెందిన చీప్ ఇంజనీర్లు ఉన్నారు.. ఇక, విజిలెన్స్‌ ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ నుంచి ప్రతినిధిని కూడా కమిటీలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు..

Read Also: BMW 5 Series LWB: భారత్ మార్కెట్ లోకి వచ్చేసిన బిఎండబ్ల్యూ 5 సిరీస్..

రాజధాని ప్రాంతంలో చేపట్టి వేర్వేరు నిర్మాణాలను పరిశీలించాలని సాంకేతిక కమిటీకి ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. నిలిచిపోయిన నిర్మాణ పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలన్న అంశంపై సూచనలు చేయాలని సాంకేతిక కమిటీకి ఆదేశాలు ఇచ్చింది.. దీంతో.. రాజధాని ప్రాంతంలో నిర్మాణాలపై పూర్తిస్థాయిలో పరిశీలించి. వివిధ నిర్మాణాల పటిష్టత.. స్థితిగతులను తెలుసుకుని.. ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది సాంకేతిక కమిటీ.. రాజధాని అమరావతిలో రహదారుల విధ్వంసం, పైపులైన్లు తదితర అంశాలను కూడా సాంకేతిక కమిటీ పరిశీలించనుంది. కాగా, గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అమరావతిలో నిర్మాణాలు జరిగాయి.. అయితే, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఆ నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిపివేశారు.. మరోవైపు.. మూడు రాజధానులపై నిర్ణయం తీసుకుంది వైఎస్‌ జగన్‌ సర్కార్.. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని అందుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. మళ్లీ అమరావతి రాజధానిలో నిర్మాణలపై ఫోకస్‌ పెట్టింది.. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించి.. ఆయా కట్టడాలను సీఎం చంద్రబాబు పరిశీలించిన విషయం విదితమే. మరోవైపు.. తాజాగా కేంద్ర బడ్జెట్‌లో ఏపీ రాజధాని కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో.. రాజధాని ప్రాంతంలో నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతోంది ఏపీ సర్కార్.