AP Deputy Mayor Elections: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు కూడా ముగిసాయి.. ఇక, ఈ రోజు డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పదవుల పంపకాలపై సీట్ల సర్దుబాటు పూర్తయింది. కార్పొరేషన్ల డిప్యూటీ మేయర్, మున్సిపల్ వైస్ చైర్మన్ పదవులను మూడు పార్టీలు పరస్పర అంగీకారంతో పంచుకున్నాయి.
డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. టీడీపీ పోటీ చేయనున్న కార్పొరేషన్ల డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఈ మేరకు ఏడు నగరాల అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. అనంతపురం డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా టి. స్వాతి, చిత్తూరులో ఏ. గోపీనాథ్, ఏలూరులో పృథ్వీ శారద, కడపలో మన్సూర్ ఆలీఖాన్‌ను ఎంపిక చేశారు. అలాగే ఒంగోలులో చావలి చర్పిత, విజయవాడలో చెన్నుపాటి క్రాంతి శ్రీ, విజయనగరంలో ప్రసాదుల రజనీ పేర్లను ఖరారు చేశారు.
కూటమి పార్టీల మధ్య పదవుల పంపకాలు
కార్పొరేషన్ల డిప్యూటీ మేయర్ పదవుల విషయంలో టీడీపీకి ఏడు, జనసేనకు నాలుగు, బీజేపీకి రెండు స్థానాలు కేటాయించాలని కూటమి నేతలు నిర్ణయించారు. అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ పదవుల్లో టీడీపీకి 59, జనసేనకు 19, బీజేపీకి ఏడు స్థానాలు కేటాయించేలా సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. మొత్తంగా కూటమి పార్టీల మధ్య పదవుల పంపకాలు పూర్తికావడంతో నేటి ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆయా స్థానాల్లో కూటమి పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దించనున్నాయి.

