NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు..

Pawankalyan

Pawankalyan

Deputy CM Pawan Kalyan: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని అందుకుంది.. 70 స్థానాలున్న ఢిల్లీలో.. బీజేపీ 47 స్థానాల్లో విజయాన్ని అందుకోగా.. ఆప్‌ 23 స్థానాలకే పరిమితం అయ్యింది.. అయితే, కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఖాతా కూడా తెరవలేదు.. ఇక, ఢిల్లీలో బీజేపీ విజయంపై స్పందించిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విశ్వాసం మరోమారు రుజువైందన్నారు.. 2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా నరేంద్ర మోడీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారు. సంక్షేమాన్ని విస్మరించని అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారు. నరేంద్ర మోడీ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో దేశ రాజధాని ఢిల్లీ పాత్ర అత్యంత కీలకంగా పేర్కొన్నారు..

Read Also: Nagachaitanya: నెటిజన్ ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగ చైతన్య..?

ఈ తరుణంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించడం స్వాగతించదగ్గ పరిణామం అన్నారు పవన్‌ కల్యాణ్‌.. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమం క్షేత్ర స్థాయికి చేరతాయి. ఢిల్లీ అభివృద్ధికి, దేశ రాజధానిలోని ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం వికసిత సంకల్ప్ పత్రం ద్వారా బీజేపీ ఇచ్చిన హామీలు ప్రజల మెప్పు పొందాయి. నరేంద్ర మోడీపై ఢిల్లీ ప్రజలు ఉంచిన విశ్వాసానికి ప్రతీక అక్కడి ఘన విజయం. ఆర్థిక అవకతవకలకు ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల అమలు, పరిపాలన సాగుతాయని అక్కడి ప్రజలు విశ్వసించారు. కేంద్ర హోం శాఖామాత్యులు అమిత్ షా.. దేశ రాజధాని ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకొన్నారు. ఆయన రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలను ఇచ్చాయి. కేంద్ర ఆరోగ్య శాఖామాత్యులు, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా.. కూటమిని ముందుకు తీసుకువెళ్లడంలో సఫలీకృతులయ్యారని పేర్కొన్నారు.. ఇక, ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో విజయానికి మూల కారకులైన ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ, దాని మిత్ర పక్ష నాయకులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ.. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు..