NTV Telugu Site icon

CM Chandrababu: ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు

Cnb

Cnb

CM Chandrababu: కేంద్ర బడ్జెట్‌కు ఆంధ్రప్రదేశ్‌కి నిధుల కేటాయింపుపై హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లుపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. ”మన రాష్ట్ర అవసరాలను గుర్తించి రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.. ఇక, ”వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నుండి వచ్చే సహకారం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి చాలా ఉపయోగపడుతుంది.. రాష్ట్రానికి విశ్వాసాన్ని పెంచే బడ్జెట్‌ను సమర్పించినందుకు కేంద్రాన్ని అభినందిస్తున్నా.. ఏపీ మళ్లీ గాడిలో పడుతోంది” అంటూ ట్విట్టర్‌ (ఎక్స్‌)లో పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..

Read Also: Telangana Assembly: ముగిసిన బీఏసీ సమావేశం.. 25 న బడ్జెట్.. 31 వరకు సభ..

కాగా, బడ్జెట్‌ 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వరాల జల్లు కురిసింది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు చెప్పారు. అంతేకాదు అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సంపూర్ణ సాయం చేస్తామని తెలిపారు. ఏపీ రాష్ట్రం, రైతులకు పోలవరం జీవనాడి అని పేర్కొన్నారు. భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైందని నిర్మలమ్మ వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు. విభజన చట్టం ప్రకారం.. పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామన్నారు. హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం చేస్తామని నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్న విషయం విదితమే.