NTV Telugu Site icon

Amaravati Construction: రాజధాని నిర్మాణంపై కీలక ప్రకటన.. మూడేళ్లలో పూర్తి..!

Minister Narayana

Minister Narayana

Amaravati Construction: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన ఏపీ రాజధాని అమరావతి పునఃనిర్మాణంపై వేగంగా అడుగులు వేస్తోంది.. అయితే, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం రానున్న మూడేళ్లలో పూర్తి చేస్తామంటూ కీలక ప్రకటన చేశారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. ఇప్పటికే అనుమతి లభించిన 45 వేల కోట్ల రూపాయల నిర్మాణాలకి రేపు కేబినెట్‌ సమావేశంలో ఆమోదం తెలిపి.. టెండర్లు పిలవబోతున్నామని తెలిపారు. అమరావతి మొత్తం ప్రాజెక్టు వ్యయం 62 వేల కోట్ల రూపాయలు అని వెల్లడించారు. రాజమండ్రిలో పర్యటనలో మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. వచ్చే ఏడాది జులైలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. గత ఆరు నెలలుగా రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పరిపాలన గాడిలో పెట్టామని అన్నారు. రాజధాని అమరావతిలో రానున్న మూడేళ్లలో ఐదు ఐకానిక్ టవర్లు..‌ 250 మీటర్ల ఎత్తులో అసెంబ్లీ భవనం.. హైకోర్టు సహా.. అధికారుల నివాసాలు.. ట్రంక్ రోడ్లు పూర్తి చేస్తామని వెల్లడించారు మంత్రి పొంగూరు నారాయణ..

Read Also: Tollywood Rewind 2024 : 2024లో భారీ బ్లాక్ బస్టర్లుగా నిలిచిన తెలుగు సినిమాలివే

ఇక, నగర పాలక సంస్థ, ఇండియన్ ఆయిల్ కంపెనీ సౌజన్యంతో ఏర్పాటు చేసి నిర్వహించనున్న ఫిల్లింగ్ స్టేషన్ (పెట్రోల్ బంకు) ఇతర కార్పొరేషన్లకు స్ఫూర్తిదాయకమని అన్నారు మంత్రి నారాయణ.. రాజమహేంద్రవరంలో నూతనంగా ప్రారంభించుకున్న పెట్రోల్ బంకును స్ఫూర్తిదాయంగా తీసుకొని.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీ పరిధిలో పెట్రోల్ బంకులు ఏర్పాటు కార్యాచరణ ప్రణాళికలు ఏర్పాటు చేయటం జరుగుతుంది. గత ప్రభుత్వం టాక్స్ లను ఎన్నోసార్లు పెంచారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు సంబంధించి వినియోగిస్తున్న వాహనాల ఆయిల్స్ ప్రతి నెలా రూ.25.54 లక్షలు ఖర్చు చేస్తున్నాం. ఆర్ఎమ్సీ ద్వారా ఐఒసిఎల్ సౌజన్యంతో పెట్రోల్ బంకు ఏర్పాటు వలన ఖర్చు ఆదా అవుతుంది. ఈ పెట్రోల్ బంకు నిర్మాణానికి నగరపాలక సంస్థ అందుకు అవసరమయ్యే స్థలాన్ని అందించింది. ఈ బంక్ ఏర్పాటు ద్వారా రోజుకు రు.3 లక్ష రూపాయలు టర్నోవర్ జరుగుతుందని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి నారాయణ..