NTV Telugu Site icon

AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అజెండాపై చర్చ

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ సమావేశం ఇవాళ జరుగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరుగనుంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ పథకం విధి విధానాలకు ఆమోద ముద్ర వేయనుంది. కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల పథకం లబ్ధిదారులు, పథకానికి అర్హుల ఎంపిక, ఆర్థిక భారం వంటి అంశాల పైన చర్చించి అర్హుల ఎంపికపైన తుది నిర్ణయం తీసుకోనుంది.

Read Also: Maharashtra: 45 మంది అభ్యర్థులను ప్రకటించిన శివసేన.. సీఎం ఏ స్థానం నుంచి పోటీ చేస్తున్నాడంటే

చెత్త పన్ను రద్దుపైన ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ఈ నిర్ణయం అమలుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది. దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దేవాలయాల్లో ఛైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.

Read Also: Navya Haridas: వయనాడ్‌ బైపోల్‌లో విజయం తనదేనన్న నవ్య హరిదాస్

పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం తాజాగా 2వేల 800 కోట్లు విడుదల చేసింది. ప్రాజెక్టు పనుల గురించి ఈ భేటీలో అధికారులు వివరించనున్నారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం ఆమోదం..తదుపరి అడుగుల గురించి చర్చించనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నాలుగు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపైనా చర్చించే అవకాశం కనిపిస్తోంది.. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాల పైన మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. వీటితో పాటుగా వాలంటీర్ల సర్వీసు కొనసాగింపు.. వేతనాల చెల్లింపు పైన మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల నియామకం పైన నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది.